డెంగ్యూ, ప్లేట్‌లెట్స్ పేరుతో దోపిడీ చేస్తే కఠిన చర్యలు
ప్రయివేటు ఆస్పత్రులకు మంత్రి దామోదర హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులకు సూచించారు. డెంగ్యూ, ప్లేట్‌లెట్స్ పేరుతో ప్రయివేట్ ఆస్పత్రుల్లో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన సీజనల్ వ్యాధుల నివారణ, నియత్రణపై సమీక్షించారు. రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులొచ్చాయనీ, దీంతో ఈ ఏడాది మే, జూన్ నుంచే అక్కడక్కడా సీజనల్ వ్యాధులు మొదలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా జిల్లాల్లో డెంగ్యూ కేసులు తక్కువగా నమోదయ్యాయనీ,అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో స్వల్పంగా కేసులు పెరిగాయని తెలిపారు. 19 జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో పదికంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని అన్నారు. గతేడాదితో పోలిస్తే టైఫాయిడ్ కేసులు కూడా చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు.
యాంటిలార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలి
కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో, గ్రేటర్ హైదరాబాద్‌లో యాంటిలార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయా వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై కలెక్టర్లతో సమీక్షించాలని హెల్త్ సెక్రెటరీకి మంత్రి సూచించారు. ట్రైబల్ ఏరియాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలనీ, ఐటీడీఏ పీవోలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా అధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు ఎక్కు వగా నమోదవుతున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతా ధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో అవసరమైన అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని అధికారులను కోరారు. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచిం చారు. సీజనల్ వ్యాధులపై ప్రతి సోమవారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే, ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఒకవేళ సీజనల్ వ్యాధుల బారినపడితే, ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సేవలను ఉపయోగించుకోవాలనీ, అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సీజనల్ వ్యాధులను నియంత్రించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES