Sunday, July 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎప్‌సెట్‌ మాక్‌ కౌన్సెలింగ్‌లో 77,154 మందికి సీట్ల కేటాయింపు

ఎప్‌సెట్‌ మాక్‌ కౌన్సెలింగ్‌లో 77,154 మందికి సీట్ల కేటాయింపు

- Advertisement -

– సీట్లు పొందని వారు 16,905 మంది
– నేటినుంచి వెబ్‌ఆప్షన్ల మార్పులకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎప్‌సెట్‌ (ఎంసెట్‌) తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా మొదటి సారిగా ప్రవేశపెట్టిన మాక్‌ సీట్లను సాంకేతిక విద్యాశాఖ శనివారం కేటాయించింది. ఈ మేరకు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 95,256 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారని తెలిపారు. 94,059 మంది అభ్యర్థులు 56,63,308 వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. రాష్ట్రంలో 172 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 83,054 సీట్లు కన్వీనర్‌ కోటాలో ఉన్నాయని తెలిపారు. మాక్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా 77,154 (92.89 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇంకా 5,900 (7.11 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు.
సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయకపోవడం, ఇతర కారణాల వల్ల 16,905 మందికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 6,021 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఈనెల 15 వరకు వెబ్‌ఆప్షన్ల మార్పు, చేర్పులకు అవకాశం కల్పించామని వివరించారు. వాటినే ఎప్‌సెట్‌ మొదటి విడత వెబ్‌ఆప్షన్లుగా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక కేటగిరీ (ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌) కింద ఉన్న అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించలేదని తెలిపారు. వారికి ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లోనే సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈనెల 18న ఎప్‌సెట్‌ తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన సీట్లను కేటాయిస్తామని వివరించారు. ఇతర వివరాలు, వెబ్‌ఆప్షన్ల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రవaజూషవ్‌.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
మాక్‌ సీట్ల కేటాయింపుతో అభ్యర్థులకు ఉపయోగం : బాలకిష్టారెడ్డి
ఎప్‌సెట్‌ మాక్‌ కౌన్సెలింగ్‌లో కేటాయించిన సీట్లను అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించాలని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. అవసరమైతేనే వెబ్‌ఆప్షన్లలో మార్పులు చేయాలని కోరారు. విద్యార్థులకు ఉపయోగపడడం కోసమే మాక్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించామని తెలిపారు. అభ్యర్థులు ఇచ్చిన వెబ్‌ఆప్షన్ల ఆధారంగా వారి ర్యాంకు, రిజర్వేషన్‌, లింగం ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. మాక్‌ సీట్ల కేటాయింపు తర్వాత వారికి అవగాహన కలుగుతుందని వివరించారు. అభ్యర్థులు చేసిన తప్పులు, సరైన ఆప్షన్లు ఇవ్వకపోవడం, సరైన కాలేజీ, బ్రాంచీ రాలేదన్న వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మాక్‌ సీట్ల కేటాయింపు తర్వాత వెబ్‌ఆప్షన్లలో మార్పు, చేర్పులకు అవకాశముంటుందని వివరించారు. ఒకవేళ మాక్‌ సీట్ల కేటాయింపుతో సంతృప్తిగా ఉంటే వారు ఆప్షన్లలో మార్పులు చేయొద్దని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -