నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆదివారం అయన జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ను పరిశీలించారు. పచ్చని మొక్కలు, పూల తోరణాలు, రంగుల ముగ్గులు, కొబ్బరి మట్టలతో, స్వాగత తోరణాల మధ్య ఓటర్లకు పూల మొక్కలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వాగతం పలికారు.
ఓటు హక్కు వినియోగించుకున్న 102 సంవత్సరాల మణెమ్మ అనే వృద్ధురాలికి పూల మొక్కతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి మండలంలో పర్యావరణహిత, గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ మోడల్,ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారన్నారు.
ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాగంగా రెండవ విడత జరుగుతున్న పోలింగ్ సరళని పోచంపల్లి మండలం లోని జలాల్పూర్ గ్రామంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, బీబీనగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, భువనగిరి మండలం అనంతారం ఆదర్శన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఓటర్లు ఓటు వేసేందుకు చేసిన ఏర్పాట్లను, పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు ప్రశాంతంగా ఆహ్లాదకరమైన, పర్యావరణ హితమైన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని అన్నారు. గ్రామాలలో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ వెల్లడించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ శాతాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత లోనికి ఎవ్వరిని అనుమతించకుండా క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు మాత్రమే అవకాశం కల్పించాలన్నారు.
పోలింగ్ పూర్తయిన తర్వాత 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను సంబంధిత అధికారులు జాగ్రత్తగా చేపట్టాలన్నారు.పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు అవస్థకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల ముందు ఓట్లు లెక్కించే సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



