Friday, December 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యామ్నాయ శక్తిగా లౌకిక శక్తులు, వామపక్షాలు ఎదగాలి

ప్రత్యామ్నాయ శక్తిగా లౌకిక శక్తులు, వామపక్షాలు ఎదగాలి

- Advertisement -

మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
దేశంలో వామపక్ష పార్టీలు బలపడాలి : ఏఐఎఫ్‌బి ప్రధాన కార్యదర్శి దేవరాజన్‌
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బండ సురేంద్‌రెడ్డి వర్థంతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ విధానాలను తిప్పికొట్టేందుకు దేశంలోని ప్రజాస్వామిక, లౌకిక శక్తులు, వామపక్షాలు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేత బండ సురేంద్‌రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. బీసీకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకుంటున్నది. సామాజిక, ఆర్థిక అంతరాలు పెరిగేలా, దోపిడీదారులకు మరిన్ని లాభాలను కట్టబెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నది. అడవుల్లోని ఖనిజవనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమానికి పూనుకున్నది. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నది.

ఇలాంటి తరుణంలో కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలపై ఉంది. రాష్ట్రంలో కూడా ప్రజావ్యతిరేక విధా నాలను అనుసరిస్తున్నది. వేల కోట్ల రూపాయల విలువైన భూములను కార్పొరేట్లకు దారాదత్తం చేసేందుకు హిల్ట్‌ విధానాన్ని ముందుకు తెచ్చినది. మరోవైపు ఆరు గ్యారెం టీలను విస్మరిస్తున్నది. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉధృతమైన పోరాటాలు ముందుకు రావాల్సిన అవసరముంది. లౌకికశక్తులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షశక్తులు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. సురేందర్‌రెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అదే’ అని జాన్‌వెస్లీ చెప్పారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి దేవరాజన్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి అకాల మరణం తీరని లోటు అన్నారు. ఆయన అందరితోనూ కలుపుగోలుగా ఉండేవారని గుర్తుచేశారు. తనకు విలువైన సూచనలు ఇచ్చేవారని తెలిపారు.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ పార్టీ కోసం పనిచేశారని గుర్తుచేశారు. సోషలిస్టు వ్యవస్థ కోసం నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ పనిచేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తమ పార్టీ పోరాటాలు చేస్తున్నదని తెలిపారు. ఆపరేషన్‌ కగార్‌ను, బూటకపు ఎన్‌కౌంటర్లను తప్పుబ ట్టారు. దేశంలో వామపక్ష ఉద్యమాలు బలపడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వర్థంతి సభలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జె.వి.చలపతిరావు, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఏఐఎఫ్‌బీ ఏపీ ప్రధాన కార్యదర్శి పి.వి.సుందర రామరాజు, సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అన్వేష్‌, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌.మురహరి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌, ఏఐఎఫ్‌బి నాయకులు ఆర్‌.వి.ప్రసాద్‌, కోమటిరెడ్డి తేజ్‌దీప్‌, దయానంద్‌, బుచ్చిరెడ్డి, తదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -