Saturday, November 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురైతాంగంపై సీడ్‌బాంబ్‌

రైతాంగంపై సీడ్‌బాంబ్‌

- Advertisement -

ముసాయిదా బిల్లును వెబ్‌సైట్‌లో పెట్టిన కేంద్రం
మూడు వ్యవసాయ నల్లచట్టాల అమలుకు దొడ్డితోవ
బీహార్‌లో గెలవగానే రైతులపై మళ్లీ కక్షసాధింపు చర్యలు
అభ్యంతరాల సమర్పణకు డిసెంబర్‌ 11 వరకు గడువు

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై ‘విత్తన బాంబు’ విసిరేసింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించగానే, గతంలో వెనక్కి తగ్గిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ‘డ్రాఫ్ట్‌ సీడ్‌ బిల్‌-2025’ పేరుతో ముసాయిదా బిల్లు రూపంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఆగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌లో ఈనెల 13వ తేదీ రాత్రి పెట్టారు. అయితే నేరుగా ఈ బిల్లు ఆ వెబ్‌సైట్‌లో ఓపెన్‌ కావట్లేదు. పీఐబీకి చెందిన వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారానే ఓపెన్‌ అవుతోంది. ఈ బిల్లుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను డిసెంబర్‌ 11వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా తెలపాలని పేర్కొంది. భారతదేశ రైతాంగం సుదీర్ఘకాలంగా ఏ విధానాలకు వ్యతిరేకంగా అయితే పోరాడుతోందో, అవే అంశాలను ఈ బిల్లులో పొందుపర్చారు.

”వ్యవసాయ రంగంలో సమగ్ర సంస్కరణలు-డ్రాఫ్ట్‌ సీడ్‌ బిల్‌ – 2025” బిల్లులోని అంశాలు
దేశంలోని విత్తనాల ఉత్పత్తి, ప్రమాణీకరణ, నిల్వ, పంపిణీ, రైతు రక్షణ వంటి వ్యవస్థలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్‌ సీడ్‌ బిల్‌-2025 ప్రకటించింది. 1966లో అమల్లోకి వచ్చిన పాత సీడ్స్‌ యాక్ట్‌ స్థానంలో, కొత్త సాంకేతికతలు, అధిక దిగుబడి జాతులు, బయోసేఫ్టీ ప్రమాణాలు, రైతు పరిరక్షణ హక్కులను ప్రతిబింబించే విధంగా చట్టాన్ని తెచ్చేదిశగా దీన్ని రూపొందించినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
దేశవ్యాప్తంగా విక్రయించే అన్ని విత్తనాలు తప్పనిసరిగా కేంద్రప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ పొందాలి. దానికోసం ఆయా కంపెనీలు మొలక శాతం, దిగుబడి సామర్థ్యం, వ్యాధి నిరోధకత, ఫీల్డ్‌ ట్రయల్‌ ఫలితాలు, ప్రయోగశాల పరీక్షా ధ్రువపత్రాలు అందచేయాలి.
విత్తనం నాణ్యత రీత్యా లోపాలు ఉంటే, లేదా కంపెనీ చేసిన ప్రచారం ప్రకారం దిగుబడి రాకపోతే, రైతు నేరుగా పరిహారం కోరే హక్కు ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశానికి ఒకే విధమైన జాతీయ విత్తన ప్రమాణాలు రూపొందిస్తుంది. విత్తన రకాల కోసం స్వచ్ఛత శాతం, తేమ పరిమితి, మొలక శాతం, నిల్వ ప్రమాణాలు వంటి నిబంధనలు విధించింది.

కొత్త విత్తనం మార్కెట్లో విక్రయించాలంటే కనీసం రెండు సాగు సీజన్లు ఫీల్డ్‌ ట్రయల్‌ తప్పనిసరి. ఈ ట్రయల్స్‌లో వాతావరణాన్ని తట్టుకునే శక్తి, వ్యాధి నిరోధకత, నిజమైన దిగుబడి వంటివి పరీక్షీస్తారు.
అనుమతి లేకుండా లేదా ప్రమాణాలు లేకుండా విత్తనాలు విక్రయిస్తే భారీ జరిమానాలు, లైసెన్స్‌ రద్దు, గోడౌన్‌ సీజ్‌, అక్రమ స్టాక్‌ స్వాధీనం వంటి చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుందని పేర్కొన్నారు.
రైతులు వ్యవసాయ భూముల్లో పండించి, నిల్వ ఉంచి, మార్పిడి చేసుకునే సంప్రదాయ విత్తన వ్యవస్థ ఈ చట్టం పరిధిలోకి రాదనీ, దానికి ఎలాంటి లైసెన్స్‌ అవసరం లేదని తెలిపారు.
విత్తనాల దిగుమతి చేసేవారు తప్పనిసరిగా బయోసేఫ్టీ పరీక్షలు, క్వారంటైన్‌ ప్రక్రియ, నేషనల్‌ బ్యూరో ప్రమాణాలు అనుసరించాలి. జాతీయ భద్రత, జీవవైవిధ్య రక్షణను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు రూపొందించామని పేర్కొన్నారు.
విత్తన సరఫరా గొలుసుపై పర్యవేక్షించేందుకు దేశంలో విత్తన పంపిణీ, నిల్వ, రవాణా, విక్రయం వంటి వ్యవస్థలను కేంద్ర స్థాయిలో నియంత్రణ కమిటీ, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తామని ముసాయిదాలో తెలిపారు.
అలాగే విత్తనం ఏ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యిందో, ఏ కంపెనీ తయారు చేసిందో, ఎప్పుడు సర్టిఫై అయ్యిందో చెక్‌ చేసే ”సీడ్‌ ట్రేసింగ్‌ సిస్టమ్‌”ను ఈ బిల్లు ప్రతిపాదించారు.

రైతాంగానికి కష్టనష్టాలు
ఈ బిల్లులో విత్తన ధరల నియంత్రణ స్పష్టంగా లేదు. దీనివల్ల కంపెనీలు అధిక ధరలకు విత్తనాలు విక్రయించే అవకాశం ఉంది. రైతులపై ఆర్థిక భారాలు పెరుగుతాయి. విత్తన మార్కెట్‌లో గుత్తాధిóపత్యం ఏర్పడే ప్రమాదం ఉంది.
కంపెనీలు సమర్పించే ఫీల్డ్‌ ట్రయల్‌ డేటా, మొలక దిగుబడి ప్రమాణాలు వంటివన్నీ ఆయా సంస్థలే అందిస్తాయి. అధికారుల పర్యవేక్షణ తక్కువైతే తప్పుడు డేటా, ఒత్తిడితో ఇచ్చే ల్యాబ్‌ సర్టిఫికేట్లు, ”సూపర్‌ హై యీల్డ్‌” అనే పేరుతో రైతులను తప్పుదోవ పట్టించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
పరిహారం పొందే ప్రక్రియను క్లిష్టంగా రూపొందించారు. బిల్లు రైతుకు పరిహారం హక్కు ఇస్తున్నా, నమూనాలు సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, విచారణ, కంపెనీతో నోటీసుల మార్పిడి వంటి పద్ధతులు సుదీర్ఘంగా, సాంకేతికంగా క్లిష్టతరమై పూర్తిగా అధికారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల రైతులు సమయానికి పరిహారం పొందలేరు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రయివేటు కంపెనీలకు అనుకూలంగా మారుతుంది. రిజిస్ట్రేషన్‌ ప్రమాణాలు, ల్యాబ్‌ టెస్టింగ్‌, గణాంకాలు, క్లినికల్‌ డేటా, రెండు సీజన్‌ ట్రయల్స్‌ వంటి అంశాలన్నీ పెద్ద కంపెనీలు, కార్పొరేట్లకు పూర్తిగా అనుకూలం. చిన్న విత్తన ఉత్పత్తిదారులు ఈ భారాన్ని మోయలేరు. ఫలితంగా బహుళజాతి కంపెనీలు మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. చివరకు రైతులు తమకు ఏం కావాలో ఎంపిక చేసుకొనే పరిస్థితుల్ని కోల్పోవాల్సి వస్తుంది.

భవిష్యత్‌లో కొత్త జాతులపై ఐపీఆర్‌ హక్కులు, ప్రయివేటు కంపెనీల రాయల్టీలు, బయోటెక్‌ కంపెనీలకే పరిమితమై, రైతుల స్వీయ విత్తన ఉత్పత్తిపై పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి.
ట్రేసబిలిటీ వ్యవస్థ చిన్న రైతులకు భారమౌతుంది. డిజిటల్‌ ట్రేసింగ్‌, క్యూఆర్‌ కోడ్‌, టెక్‌ ఆధారిత ప్రమాణాలను ఈ చట్టం ప్రవేశపెడుతుంది. పెద్ద రైతులు, కంపెనీలకు ఇవి అనుకూలంగా ఉంటాయి.కానీ చిన్న రైతులకు భారమవుతుంది. డిజిటల్‌ అవగాహన తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యవస్థ అమలు అడ్డంకిగా మారవచ్చు.
దిగుమతి విత్తనాల పెరుగుదల దేశీయ విత్తన ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. పైకి కఠిన నిబంధనలు ఉన్నా, దిగుమతి మార్గాలు తెరవడం వల్ల విదేశీ విత్తన మల్టీనేషనల్‌ కంపెనీలు మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో ప్రవేశిస్తాయి. భారతీయ విత్తన కార్పొరేషన్లు, స్వదేశీ కంపెనీలు పోటీ కోల్పోతాయి. బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యం పెరిగి రైతులు వారిపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడతాయి.
విత్తనాల లైసెన్సింగ్‌ నిర్ధారణ అవినీతికి ఆజ్యం పోస్తుంది. ఈ చట్టం ప్రకారం అధికారులకు పెద్ద అధికారాలే ఇచ్చారు. నమూనాల సేకరణ, నిల్వ సీజ్‌, గిడ్డంగుల తనిఖీ, కేసుల నమోదు వంటి అంశాల్లో అధికారుల వివేచన మేరకు వ్యవహరిస్తారు. ఫలితంగా అధికార పక్షపాతం జరిగితే రైతు న్యాయం పొందడం సంక్లిష్టమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -