Friday, October 31, 2025
E-PAPER
Homeమానవిబహుముఖ ప్రజ్ఞాశాలి సీతాలక్ష్మి

బహుముఖ ప్రజ్ఞాశాలి సీతాలక్ష్మి

- Advertisement -

డాక్టర్‌ చీదెళ్ల సీతాలక్ష్మి… తాను పెరిగిన కుటుంబంలో సాహిత్య వాతావరణం లేకున్నా సాహిత్యమే ప్రాణంగా సాగిపోతున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి.. సాహిత్యం, సమాజ సేవ రెండు కళ్లుగా జీవిస్తున్నారు. కవయిత్రిగా, రచయిత్రిగా, ఆధ్యాపకురాలిగా సాహిత్యానికి ఎంతో సేవ చేస్తున్నారు. సినారే, శ్రీశ్రీ, ఆత్రేయ వంటి గొప్ప సాహిత్య కారుల సమక్షంలో ఎదిగారు. తను చేస్తున్న సాహిత్య సేవకు గాను ‘కవిరత్న’ బిరుదును అందుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

ఘటకేసర్‌ దగ్గర ఏదులాబాద్‌ గ్రామంలో 1959లో డా.చీదెళ్ళ రాఘవశాస్త్రి, జానకమ్మ దంపతులకు జన్మించారు సీతాలక్ష్మి. తండ్రి ఆయుర్వేదిక్‌ డాక్టర్‌, తల్లి గృహిణి. వారి ఇంట్లో సాహిత్య వాతావరణమే లేదు. చిన్నతనంలో గ్రామంలోనే పెరిగారు. కుటుంబం హైదరాబాద్‌ వలస రావడంతో 10వ తరగతి పూర్తయ్యాక ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఓరియంటల్‌ కళాశాలలో డి.ఓ.ఎల్‌, బి.ఓ ఎల్‌ చేశారు. అప్పుడే పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకే ఆమె పండిట్‌ ట్రైనింగ్‌ కూడా చేయలేదు. విద్యార్థిగా ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవారు. ఓరియంటల్‌ కాలేజీలో చేరిన తర్వాతనే తెలుగు సాహిత్యంపై సీతాలక్ష్మికి అనుబంధం, ఆసక్తి పెరిగాయి. కళాశాలలో ప్రతిరోజూ జరిగే సాహిత్య సభలలో పాల్గొనేవారు. గొప్పవాళ్ళ ఉపన్యాసాలు వినే అవకాశం ఆమెకు దక్కింది. దివాకర్ల వెంకటావధాని, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, ఆచార్య సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, పుట్టపర్తి నారాయణాచార్యులు, చెరుకూరి రామారావు, నాయని కృష్ణకుమారి మొదలైన మహా కవులు, సాహితీ వేత్తల ప్రసంగాలు, ఉపన్యాసాలు వింటూ పెరిగారు.

మహామహుల శిష్యరికంలో
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మె తెలుగులో చేరిన తర్వాత సినారె, ముదిగొండ శివప్రసాద్‌, ఇటివెంటి కృష్ణమూర్తి, పాకాల యశోదారెడ్డి వంటి మహామహుల శిష్యరికంలో ఎదిగారు. డా.ఇటివెంటి కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎం.ఫిల్‌, డా.కె.వి.సుందరాచార్యుల పర్యవేక్షణలో తెలుగులో లేఖా సాహిత్యంపై పీహెచ్‌డీ చేశారు. 16 ఏండ్ల వయసులో రేడియోలో ప్రసంగం చేయడం తన మరువలేని అనుభూతిగా చెప్పుకుంటారు. తర్వాత కాలంలో సాహిత్య మాస పత్రిక మూసీ, ప్రజాశక్తి, శ్రీవాణి పత్రికలలో ఆమె వ్యాసాలు ప్రచురించబడేవి. ఏపీపీఎస్సీ ద్వారా అధ్యాపకురాలిగా నల్లగొండ కళాశాలలో చేరిన తర్వాత కూడా తన సాహిత్య వ్యాసాంగాన్ని మాత్రం కొనసాగించారు.

పదవీ విరమణ తర్వాత
‘సమాజ సేవే నా లక్ష్యం. వేమన కవి నాకు స్ఫూర్తి, ఆదర్శం. సామాజిక హితం నా మతం’ అంటున్న సీతాలక్ష్మి దూరదర్శన్‌లో పద్యతోరణంలో పాల్గొని బహుమతి పొందారు. రేడియో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఆచార్యులుగా పదవీ విరమణ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ఫెలోగా ఎమ్మె తెలుగు విద్యార్థులకు పాఠాలు చెప్పారు. దాదాపు 40 ఏండ్ల నుండి రాస్తున్నప్పటికి తన పదవీ విరమణ అనంతరం కవితా ప్రస్థానాన్ని విస్తృతం చేశారు. అనేక పుస్తకాలను కూడా ముద్రించారు. అనేక ప్రక్రియల్లో ఆమె రాసిన వ్యాసాలు, రచనలు అచ్చయ్యాయి, అవుతున్నాయి. ఫేస్‌బుక్‌ వేదికగా కూడా ఎన్నో కవితలు రాస్తూ పోటీలలో విజేతగా నిలుస్తున్నారు.

అందుకున్న పురస్కారాలు
పెండ్లి తర్వాత భర్త వెంకట సత్యమూర్తి సహకారం సీతాలక్ష్మికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన అండదండ అమోఘం. అనునిత్యం భార్య వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. సి.నా.రె పురస్కారం, అంబేద్కర్‌ సాహితీ రత్న పురస్కారం, జానకీ రాఘవీయం శతకానికి పెందోట పురస్కారం, సీతమాట ద్విశతికి కర్ణాటక వారి పురస్కారం, విజేతగా నిలిచిన కవితలకు నగదు పురస్కారం, కవితా భూషణ, కవితా విభూషణ, కవిరత్న, సమీక్షా విభూషణ, తెలుగు కీర్తి, మాతృదేవోభవ బిరుదులు అందుకున్నారు. అలాగే రాష్టప్రభుత్వంచే ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ అవార్డు, ఉత్తమ జిల్లా ఉపాధ్యాయ, ఉత్తమ జిల్లా మహిళా సాధికారత అవార్డులు సైతం అందుకున్నారు.

అనేక ప్రక్రియల్లో…
తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో అంటే పద్యాలు, వచన కవిత్వమే కాక ఆధునిక నూతన కవితారూపాలైన గజల్‌, ఇష్టపదులు, మణిపూసలు, మొగ్గలు, నానీలు, రుబాయిలు, కథలు, వ్యాసాలు ఇలా వివిధ రకాలుగా సాహిత్య సృజన చేస్తూ తెలుగు భాషాభివృద్ధిలో తన వంతు సేవ చేస్తున్నారు. నందగిరి ఇందిరాదేవి కథలు, నందగిరి ఇందిరాదేవి అమ్మమ్మ కథలకు సంపాదకులుగా ఉండడం, తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ముద్రించడం తన సాహిత్య జీవనంలో ఓ మైలు రాయి. 100కు పైగా కవితా సంకలనాలలో, పద్యాసంకలనాలలో తన రచనలు ముద్రింపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో జరిగే అనేక కవి సమ్మేళనాలు, సాహిత్య సమావేశాల్లో పాల్గొని తన గొంతును వినిపించడమే కాక అమెరికాలో జరిగిన సాహిత్య సభల్లో పాల్గొని పత్రసమర్పణ, కవితా పఠనంతో పాటు ప్రసంగం చేశారు. దర్పణం సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ వివిధ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పరిశోధక గ్రంథాలు
ఆమె గురువులు డా.సి.నారాయణరెడ్డి, హాస్యబ్రహ్మ శంకరనారాయణగార్ల చేతుల మీదుగా తాను పీహెచ్‌డీ చేసిన తెలుగులో లేఖా సాహిత్య గ్రంథాన్ని 2005లో ఆవిష్కరించారు. తెలుగు కావ్యావతారికాలలో సాహిత్య విమర్శ అనే ఎంఫిల్‌ సిద్ధాంత గ్రంథం తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సీతాలక్ష్మికి ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం కూతుళ్లు, అల్లుళ్లు అమెరికాలో వుంటున్నారు. అప్పుడప్పుడు సీతాలక్ష్మి దంపతులు కూతుళ్ల వద్దకు వెళ్లి అనేక ప్రదేశాలు సందర్శిస్తుంటారు. పర్యటనను కూడా ఆమె ఎంతో ఆశ్వాదిస్తారు.

తల్లిపై ప్రేమతో…
సీతాలక్ష్మికి తల్లంటే అమితమైన ప్రేమ. ఆమె మీది ప్రేమతో 2018లో జానకీ రాఘవీయం (జననీ శతకం) రచించారు. ఛందో నియమంతో, ఆటవెలది పద్యాలతో రచించిన ఈ జననీ శతకంతో తన తల్లిపైవున్న గౌరవాన్ని, ఆత్మీయతను చాటుకున్న తీరు అభినందనీయం. 2019లో నీలికమల్‌ పబ్లికేషన్స్‌ ప్రచురించిన తెలంగాణా ఆధునిక సాహిత్య గ్రంథంలో ఆమె రాసిన తెలుగు సాహిత్యం – తెలంగాణ మహిళ అని 46 పుటల వ్యాసం ప్రచురితమైనది. సీతాలక్ష్మి కవన పూదోట శీర్షికలో ఏకపది, ద్విపది, త్రిపది, చిరుకవితలు నిజంగానే కనక కుసుమాలు.

  • అచ్యుతుని రాజ్యశ్రీ.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -