విద్యాసంస్థల భూముల్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించొద్దు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో ఉర్దూ యూనివర్సిటీ భూమిని తిరిగి లాక్కునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేయడం విద్యా ద్రోహమే అవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. విద్యాసంస్థల భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించొద్దని కోరారు. ఆ యూనివర్సిటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మణికొండలోని సర్వేనంబర్ 211, 202లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 1998లో 200 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు అందులో నిరుపయోగంగా ఉన్నదనే సాకుతో 50 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేయడం దుర్మార్గం. తక్షణమే ఈ నోటీసును ఉపసంహరించుకోవాలి. తరగతి గదులు, హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులు, లైబ్రరీ, పరిశోధన కేంద్రాలు, క్రీడా స్థలాల నిర్మాణానికి నిధులు కేటాయించాలి. యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి’ అని జాన్‌వెస్లీ పేర్కొన్నారు.
‘కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల కోసం కేటాయించిన భూములపై కూడా కన్నేయడం దుర్మార్గం. ఇది అల్పసంఖ్యాక వర్గాల విద్యపై దాడి చేసి, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడమే. ఐటీ కారిడార్‌లో విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం, ఎకరాకు వందలకోట్లు పలుకుతున్న ఈ భూములను కూడా విద్యేతర ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇది దేశంలోనే ఏకైక ఉర్దూ విశ్వవిద్యాలయంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమేనని స్పష్టమవుతున్నది’ అని తెలిపారు. ‘యుజీసీ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో విద్యార్థుల అవసరాల కోసం భూమిని నిల్వ ఉంచడం తప్పనిసరి. వినియోగంలో లేదనే సాకుతో భూమిని లాక్కోవడం సరైందికాదు. యూనివర్సిటీకి కేటాయించిన 200 ఎకరాలను ఎలా వినియోగించాలో గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు, ప్రణాళికలు అందించినప్పటికీ, ఈ షోకాజ్ నోటీసును జారీ చేయడం దుర్మార్గం. ఈ భూమిని పూర్తి స్థాయిలో వర్సిటీకే పరిమితం చేస్తూ గెజిట్ విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.



