జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో మోడీ సర్కార్ అట్టర్‌ప్లాఫ్
వెనిజులాపై అమెరికా దుశ్చర్యను ఖండించలేని పిరికితనం
ఇరుగు పొరుగు దేశాలతో కయ్యం
దేశంలో దెబ్బతింటున్న సామాజిక సమైక్యత
న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా, అంతర్గతంగా లెక్కలేనన్ని సెల్ఫ్‌గోల్స్ చేసుకుంటోంది. అంతర్జాతీయ వేదికపై తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోల్పోతోంది. వెనిజులా అధ్యక్షుడు మదురో అపహరణను ఖండించకపోవడం మన బేలతనాన్ని బయటపెడుతోంది. బంగ్లాదేశ్ క్రికెటర్‌ను ఐపీఎల్ నుంచి బయటికి పంపడం ద్వారా దక్షిణాసియాలో మద్దతు కోల్పోతోంది. ఇటు దేశంలో సామాజిక ఐక్యత కరువైంది. మైనారిటీలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. ఇవన్నీ మోడీ ప్రభుత్వ స్వయంకృతాపరాధాలే.
అమెరికా అంటే భయమెందుకు?
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు సైన్యం కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. వెనిజులాను ఆక్రమించి పాలించేందుకు, ఆ దేశంలోని అపారమైన చమురు నిక్షేపాలను సొంతం చేసుకునేందుకు అమెరికా ఈ దుందుడుకు చర్యకు దిగింది. అమెరికా దుశ్చర్యను చైనా, రష్యా, మలేషియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలు దుయ్యబట్టాయి. కానీ ‘గ్లోబల్ సౌత్’కు నాయకుడిగా తనకు తాను ప్రకటించుకున్న భారత్ మాత్రం రెండు నామమాత్రపు ప్రకటనలతో సరిపుచ్చింది. వాటిలో కూడా అమెరికా పేరెత్తలేదు. ఎందుకు ఆందోళనకు గురవుతుందో కారణాన్ని వివరించలేదు.
ఒక ప్రకటనలో… వెనిజులాలో నెలకొన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని మాత్రం చెప్పింది. రెండో దానిలో…అక్కడి భారతీయులకు ప్రయాణ సలహాలు ఇచ్చింది. అమెరికా అంటే మోడీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అమెరికా ఇప్పటికే మన దేశంపై యాభై శాతం సుంకాలు విధించింది. ఈ పరిస్థితులలో ఆ దేశానికి ఆగ్రహం కలిగిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందేమోనన్న సందేహంతో ఇలా నొప్పించక…తానొవ్వక అనే రీతిలో ప్రకటనలు చేస్తోందా అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. అయితే ట్రంప్ వైఖరిని నిశితంగా పరిశీలిస్తే ఆయన మన దేశానికి ఏ మాత్రం సాయం చేసే ఉద్దేశంలో లేరని అర్థమవుతోంది.
దూరమవుతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌కు అత్యంత విలువైన ఎడమ చేతివాటం బౌలర్ ముస్తాఫిజర్ రహమాన్ అకా ఫిజ్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ సాగనంపింది. రహమాన్‌ను షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కొల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే మన దేశానికి చెందిన కొందరు సెలబ్రిటీలను బహిష్కరించాలంటూ సంఘ్ పరివార్‌కు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. షారూఖ్‌ను వివాదాస్పద బీజేపీ నాయకుడు సంగీత్ సోమ్ ‘దేశద్రోహి’గా అభివర్ణించారు.
ఫిజ్‌ను ఐపీఎల్ నుంచి బయటికి పంపడానికి బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్న కారణమే మిటంటే… బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసలో హిందువులు ప్రాణాలు కోల్పోతున్నందుకు ఆయన్ని ఐపీఎల్‌లో ఆడనీయకూడదట. భారతదేశం ఓ హిందూ దేశంలా వ్యవహరిస్తోంది. పలువురు నాయకులు బంగ్లాదేశీయులపై చొరబాటుదారులుగా ముద్ర వేశారు. షేక్ హసీనా నిష్కృమణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం వాస్తవమే. తాజాగా టీ-20 క్రికెట్ ప్రపంచ కప్‌లో తన మ్యాచ్‌ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ కోరింది. ఈ క్రీడల నిర్వహణకు భారత్ సహా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
పొరుగు దేశాలతో శతృత్వం
బంగ్లాదేశ్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడా నికి విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రయత్నాలు ఐపీఎల్ నుంచి ఫిజ్‌ను సాగనంపడంతో నీరుకారిపోయాయి. ఇది కచ్చితంగా మోడీ ప్రభుత్వం చేసుకున్న సెల్ఫ్‌గోలే. కొందరు ‘చెడ్డ పొరుగువారి’ గురించి జైశంకర్ ఇటీవలే ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవద్దని పశ్చిమాన ఉన్న ఓ దేశాన్ని ఆయన హెచ్చరించారు. చైనా కూడా మన పొరుగు దేశమే. రెండు దేశాల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవు. ఈ ప్రాంతంలోని మూడో పొరుగు దేశంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అక్కడ మన పాలకులు మంటలకు ఆజ్యం పోశారు.
ఈ పరిణామాలన్నీ క్షేత్రస్థాయి లో భారత వ్యతిరేకతను పెంచేందుకు దోహదపడతాయ నడంలో సందేహం లేదు. అంతర్జాతీయ సమాజంలో భారత్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. వెనిజులా విషయంలో పాలకుల పిరికితనం స్పష్టంగా కన్పిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెటర్ విషయంలో ప్రభుత్వం అవలంబించిన వైఖరి కారణంగా దక్షిణాసియాలో మనం మద్దతును మరింతగా కోల్పోతున్నాం. దేశానికి రక్షణ కవచంగా ఉండేది, ఉండాల్సింది అంతర్గత సమైక్యతే. ఆంతరంగికంగా బలంగా ఉంటే ఎన్ని తుపానులనైనా ఎదుర్కోగలం. కానీ దేశంలో సామాజిక సమైక్యత బలహీనపడుతున్న తరుణంలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అధికార పార్టీ రాజకీయాలు, సిద్ధాంతాలు దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి.
పేట్రేగిపోతున్న మతోన్మాదులు
జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్ పూర్‌లో క్రిస్మస్ వేడుకలకు అంతరాయం కలిగించి అరెస్టయిన ఆరుగురు బజరంగ్‌దళ్ సభ్యులకు కోర్టులో బెయిల్ లభించింది. వారికి మేళతాళాలు, పూల దండలతో స్వాగతం లభించించింది. గత ఏడాది చివరలో త్రిపురకు చెందిన ఓ వ్యక్తిని ఉత్తరాఖండ్‌లో చంపేశారు. యూపీలోని బరేలీలో ముస్లిం స్నేహితులను పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించిన పాపానికి యువతిపై దాడి జరిగింది.
ఇవేవో చెదురుమదురుగా జరిగిన, జరుగుతున్న దాడులు కావు. సంఘ్ పరివార్ నేతలు రెచ్చగొడుతూ చేస్తున్న ప్రకటనలతో మతోన్మాదులు పెట్రేగిపోతున్నారు. ప్రధాని, హోం మంత్రి సహా బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న నాయకులు కూడా మైనారిటీలపై అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడుతున్నారు. యూపీ, అస్సాం వంటి రాష్ట్రాలలో క్రైస్తవులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో మైనారిటీలపై మూకదాడులు సర్వసాధారణమైపోయాయి.



