Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల కోసం స్వయం సహాయక సంఘాలు

వికలాంగుల కోసం స్వయం సహాయక సంఘాలు

- Advertisement -

ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం పెంచేలా సర్కారు అడుగులు
ఇప్పటికే 4800 సంఘాల ఏర్పాటు…
50 వేల మందికిపైగా సభ్యుల చేరిక
మంత్రి సీతక్క చొరవతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్న సెర్ప్‌
త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతమైన మహిళా స్వయం సహాయక సంఘాల నమూనాను ఆదర్శంగా తీసుకుని వికలాంగులకు ఆర్థిక స్వావలంబన కలిగేలా, సామాజిక గౌరవం పెరిగేలా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) ప్రత్యేక కేంద్రీకరణ పెట్టి వారి కోసం సెర్ప్‌ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించేలా చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,800 దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయి. ఆ సంఘాల్లో సుమారు 50 వేలకు పైగా సభ్యులు చేరారు. ఒక్కో గ్రూపులో కనీసం ఐదుగురు సభ్యులుండేలా సెర్ప్‌ అధికారులు చూస్తున్నారు. ఈ సంఘాల్లో పురుషులు, మహిళలు చేరొచ్చు. అయితే, మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని సంఘాలకు అధ్యక్షులుగా మహిళలే ఉండేలా నిబంధనలు రూపొందించారు. దీని ద్వారా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు నిర్ణయాధికారంలో వారికి ప్రాధాన్యత లభించనున్నది. తద్వారా వికలాంగుల్లో సమూహ భావన, పరస్పర సహకార స్ఫూర్తిని పెంపొందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంఘాల ద్వారా సభ్యులు చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు పొందే అవకాశాలను సెర్ప్‌ కల్పించనున్నది. బ్యాంకు లింకేజీ సౌకర్యం ద్వారా రుణ సదుపాయాలు, ఆదాయవృద్ధికి తోడ్పడే ఆర్థిక సహకారం కూడా చేయనున్నది. దీనిపై సెర్ప్‌ ఇప్పటికే క్షేత్ర స్థాయి అధ్యయనం పూర్తి చేసి, ప్రత్యేక అధికారులను నియమించింది. త్వరలో దివ్యాంగుల సంఘాల ఖాతాల్లో రివాల్వింగ్‌ ఫండ్‌ జమ చేయనున్నది. మహిళా సంఘాల తరహాలోనే వికలాంగులకు చెందిన స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.

వికలాంగుల ఆర్థిక సాధికారతే లక్ష్యం : మంత్రి డాక్టర్‌ సీతక్క
తెలంగాణలో వికలాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో ఇతరుల మాదిరిగా వికలాంగులు కూడా ఆర్థికంగా ఎదిగి, సమాజంలో గౌరవస్థానం సంపాదిస్తారనే విశ్వాసముంది. సొంత ప్రతిభ, కృషి, పట్టుదలతో వారు జీవితాన్ని నిర్మించుకునే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. వారికి సమాన అవకాశాలు కల్పించే సమానత్వ దృక్పథంతో తమ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వారికి తగిన అవకాశాలు, ప్రోత్సాహం ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -