– అటు సరోగసీ.. ఇటు స్పెర్మ్ కలెక్షన్..
– యువతే లక్ష్యంగా వీర్యకణాల దందా
– స్పెర్మ్ ఇస్తే రూ.10వేల వరకు చెల్లింపు
– గ్రేటర్‌లో రెచ్చిపోతున్న ఫెర్టిలిటీ సెంటర్లు
– పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఐవీఎఫ్ సెంటర్లు
”తిలాపాపం.. తలా పిడికిడు” అన్నట్టుగా అటు ఫెర్టిలిటీ సెంటర్లు.. ఇటు స్మెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేస్తున్నాయి. ఇక్కడ నో రూల్స్.. నో హ్యుమానిటీ, ఓన్లీ మనీ అన్నట్టుగా రెచ్చిపోతున్నాయి. పెరుగుతోన్న సంతానలేమీ సమస్యలతో ఐవీఎఫ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పిల్లల్లేని దంపతులను మోసం చేస్తున్నాయి. సికింద్రాబాద్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన దాడులతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రాజధాని నగరం గ్రేటర్‌లో ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 50, రంగారెడ్డిలో 40, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 30 వరకు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని సెంటర్లు కూడా కొనసాగుతున్నాయి. ఐయూఎఫ్, ఐవీఎఫ్ చికిత్సల పేరుతో రూ.3 నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కాస్త పేరుగాంచిన సెంటర్లు ఏకంగా రూ.20 లక్షలు కూడా వసూలు చేయడానికి వెనుకాడటం లేదు. చికిత్సలు, మందులు వాడినా ఫలితం లేకపోవడంతో చివరకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్లలోనే శుక్రకణాల బ్యాంకులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక్కడ సరిపోను మిగిలిన వీర్యకణాలను ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దాంతో ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్స్ తీసుకునేవారు.. ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి వస్తోంది. వారికి పుట్టిన బిడ్డలు నిజంగానే వారికి పుట్టిన వారేనా..? లేక వేరే డీఎన్‌ఏ ఉందా..? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒక సంస్థ చేసిన పని, చాలా మంది తల్లిదండ్రుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇది పెను ప్రకంపనలు సృష్టించేలా ఉంది. ఇంకా ఎన్ని సంస్థలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయో.. అనే అనుమానాలు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదు..!
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమ కార్యకలాపాలు కొత్తేమీ కాదు. 2017లో బంజారాహిల్స్‌లోని సాయి కిరణ్ ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌లో అక్రమ సరోగసీ కార్యకలాపాలు బయటపడ్డాయి, ఇక్కడ పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సరోగసీ కోసం ఒప్పందాలు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు సైతం వచ్చాయి. ఈ కేసులో సరోగసీకి అనుమతి లేని విదేశీ జంటలకు సేవలు అందించినట్టు తేలింది. 2018లో ఢిల్లీలో స్పెర్మ్, గుడ్డు దొంగతనం కేసులో హైదరాబాద్‌కు కూడా సంబంధం ఉన్నట్టు తేలింది.
కమర్షియల్ సరోగసీ పూర్తిగా నిషేధం
కమర్షియల్ సరోగసీ మనదేశంలో పూర్తిగా నిషేధమైనప్పటికీ.. దందా మాత్రం అగడం లేదు. మనదేశంలో సరోగసీ, స్పెర్మ్ సేకరణలకు నిర్దిష్ట చట్టాలున్నాయి. కమర్షియల్ సరోగసీ మనదేశంలో పూర్తిగా నిషేధం. కేవలం ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ.. అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా.. ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసీకి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే సరోగేట్ మదర్ భారతీయ పౌరురాలై ఉండాలి. 25-35 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి. ఒక్కసారి మాత్రమే సరోగేట్‌గా ఉండగలదు. ఇంటెండెడ్ పేరెంట్స్ భారతీయ జంటలై ఉండాలి. విదేశీ జంటలకు సరోగసీకి అనుమతి లేదు. ఏఆర్‌టీ చట్టం ప్రకారం, స్పెర్మ్ సేకరణ కోసం ఏఆర్‌టీ బ్యాంకులు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. స్పెర్మ్ డోనర్లు 21-55 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి. హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ, సీ వంటి వ్యాధుల కోసం పరీక్షించబడాలి. జన్యు వ్యాధుల కోసం ఫ్యామిలీ హిస్టరీ కూడా తనిఖీ చేయబడాలి. ఒక డోనర్ స్పెర్మ్ 75 సార్లు మాత్రమే ఉపయోగించబడుతుంది. స్పెర్మ్ నిల్వ కోసం క్రయో-ట్యాంకులు -196సీ వద్ద నిర్వహించబడాలి. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం పదేండ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించబడవచ్చు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నా.. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సరోగసీ సెంటర్స్ రెచ్చిపోతున్నాయి.
యువతే లక్ష్యంగా దందా
బాలీవుడ్‌లోని ఓ సినిమాలో హీరో.. స్పెర్మ్ అమ్ముకుని బతికేస్తూ ఉంటాడు. అలా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొంత మంది యువకులు.. ఇదే పనిని పెట్టుకున్నారు. అందుకు కారణం సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లాంటి ఇల్లీగల్ సంస్థలు ఉండటమే. నగరంలో యువతే లక్ష్యంగా శుక్రకణాల దందా పెరిగిపోతోంది. 30 ఏండ్లలోపు యువతీ యువకుల నుంచి సేకరించిన శుక్రకణాలు, అండాలను పిల్లల కోసం పరితపించే దంపతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సరోగసీ కోసం స్పెర్మ్ సేకరిస్తున్న టెక్ క్లినిక్ నిర్వాహకులు.. స్పెర్మ్‌ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. స్పెర్మ్ క్వాలిటీని బట్టి దాతలకు రూ.5 నుంచి రూ.10వేల వరకు ముట్టచెబుతున్నారు.
అమ్మకానికి అమ్మతనం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES