నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్ చట్టం2018 సవరణకు ఆమోదం తెలిపిన క్యాబినెట్.. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీ తర్వాత ప్రత్యేక జీవో తెచ్చి కులగణన ఆధారంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణ రావు, మంత్రులు హాజరయ్యారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెల రోజుల్లో జరపాలని కోర్డు ఆదేశించింది. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదని గత ప్రభుత్వం 2018 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కు పంపింది. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది.