నవతెలంగాణ-హైదరాబాద్ : ఒకే ఊరు.. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న ముగ్గురు ప్రాణ స్నేహితులు.. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన హయత్‌నగర్ పరిధిలోని కోహెడలో తీవ్ర కలకలం రేపింది. ఒకరి మరణాన్ని జీర్ణించుకోకముందే మిగతా ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే… కోహెడకు చెందిన గ్యార వైష్ణవి (18), సతాలి రాకేశ్ (21), బుడ్డ శ్రీజ (18) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వీరి మధ్య మంచి స్నేహం ఉంది. వీరిలో వైష్ణవి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. సరైన వైద్యం తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఈ నెల 21న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బుధవారం వైష్ణవి అంత్యక్రియలు జరిగాయి. ఆ కార్యక్రమానికి ఆమె స్నేహితుడైన రాకేశ్ కూడా హాజరయ్యాడు. స్నేహితురాలి మరణంతో తీవ్రంగా కలత చెందిన రాకేశ్, ఆ రోజు రాత్రి తన డ్యూటీ ముగించుకుని ఇంటికి సమీపంలోని ఓ షటర్‌లో నిద్రపోయాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ నిద్రలేచి చూసేసరికి, రాకేశ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడిని అలా చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది.
ఈ రెండు విషాదాల నుంచి కోహెడ గ్రామస్థులు తేరుకోకముందే మరో ఘోరం జరిగింది. వీరి స్నేహితురాలైన శ్రీజ తండ్రి నరసింహ, గురువారం తెల్లవారుజామున 5 గంటలకు తన కూతురిని నిద్రలేపి డ్యూటీకి వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో శ్రీజ ఆత్మహత్య చేసుకుందంటూ ఆయనకు ఫోన్ వచ్చింది. హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా, కూతురు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఇలా వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు స్నేహితులు ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి మరణం మిగతా ఇద్దరిని ప్రభావితం చేసిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కోహెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



