26 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
నాలుగేండ్ల వయస్సు నుంచే తనపై ఆకృత్యాలు జరిగాయని వెల్లడి
ఇన్‌స్టాగ్రామ్‌లో సూసైడ్ నోట్, వీడియో పోస్టు
కాషాయ సంస్థపై తీవ్ర విమర్శలు
తిరువనంతపురం : ఆర్‌ఎస్‌ఎస్ క్యాంపుల్లో లైంగిక వేధింపులు భరించలేక 26 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. నాలుగేండ్ల వయస్సు నుంచే తనపై ఆకృత్యాలు జరుగుతున్నాయని బాధితుడు తన సూసైడ్ నోట్, వీడియోలో తెలిపారు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఒక విష సంస్థ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొట్టాయం జిల్లాలో ఎలిక్కులం పంచాయితీలోని వంచిమలకు చెందిన అనంతు సాజి ఈ నెల 9న తిరువనంతపురం సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఒక హోటల్ రూమ్‌లో ఆత్మహత్మకు పాల్పడ్డారు. సూసైడ్‌నోట్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఎన్‌ఎం (స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు నిధీష్ మురళీధరన్‌గా గుర్తించారు) తనను నాలుగు, ఐదేళ్ల వయస్సు నుంచే భౌతికంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన వివిధ క్యాంపుల్లో ఈ దారుణాలను కొనసాగించాడని వెల్లడించారు.
ఎన్‌ఎం, ఆర్‌ఎస్‌ఎస్‌తో తన ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని పేర్కొన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించే ఐటీసీ, ఓటీసీ క్యాంపుల్లోనే నాపై దారుణాలు జరిగాయి. ఆర్‌ఎస్‌స్‌తో సంబంధం ఉన్న వారితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. ఆర్‌ఎస్‌ఎస్ విషంతో నడిచేది. ఆర్‌ఎస్‌ఎస్ నిజమైన వేధింపుదారులు’ అని కూడా అనంతు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ముందుగా చిత్రీకరించిన సూసైడ్ నోట్, వీడియోను తన ఆత్మహత్య తరువాత పోస్టు అయ్యేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తనపై వేధింపులు కారణంగా మానసిక ఒత్తిడి, నిరాశకు గురవుతున్నాయని తెలిపారు. దీన్ని తన మరణ ప్రకటనగా అనంతు వర్ణించారు. ఆర్‌ఎస్‌ఎస్ క్యాంపుల్లో వేధింపులు ఎక్కువగా జరుగుతాయని కూడా ఈ వీడియోలో అనంతు తెలిపారు.
క్యాంపుల్లో లైంగిక, శారీరక వేధింపులు సహజమని, విస్తృతంగా జరుగుతాయని, అనేక మందికి ఇదే జరిగిందని, అయితే తన దగ్గర ఆధారాలు లేనందున చాలా మంది తనను నమ్మకపోవచ్చునని కూడా అనంతు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారితో దూరంగా ఉండాలని, ఆ సంస్థలో భాగం కాకూడదని కూడా ఆయన హెచ్చరించారు. ఈ వీడియో ఆధారంగా తంపనూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సెప్టెంబరు 8న రూపొందించినట్లు, తరువాత మాడుసార్లు మార్పులు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒత్తిడి, నిరాశ కారణంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)కు గురయ్యాయని, దీనికి మందులు వాడుతున్నట్టు కూడా తెలిపారు. ఈ ఘటనపై డీవైఎఫ్‌ఐ కూడా రాతపూర్వక ఫిర్యాదులు చేసింది. విచారణకు పిలుపునిచ్చింది. ఈ ఘటన ‘ఆర్‌ఎస్‌ఎస్ వికృత రూపాన్ని’ బయటపెట్టిందని విమర్శించింది.
ఆర్‌ఆర్‌ఎస్ క్యాంపుల్లో లైంగిక వేధింపులు
- Advertisement -
- Advertisement -