కలలు పత్తికాయలై పఠాల్న పగులతనేవుంటయి
జారిపోతున్న గుండెని ఒడిసిపట్టుకొని
రాలిపోయిన జ్ఞాపకాల గింజల్ని ఏరితెచ్చుకొని
పల్లేరుగాయల గాయాల పాదాల్నిఈడ్చుకుంటూ
అట్టగట్టిన కన్నీటి చారికల్ని తుడుచుకుంటూ
గోరీల గుడ్డపు యెలుగటి సాల్లల్ల
విశ్వాసపు విత్తనాలు మళ్ళీమళ్ళీ చల్లుతనేవుంటం
కొయ్యూరు ఆదిసంతోషాల లెక్క
కలలు మల్ల పఠాల్న పగులతనే వుంటయి
చీకిపోయిన దందెడ పురికొసలు విప్పుకొని
బంధాలు పుటుక్కున తెగుతనే వుంటయి
పెద్దబొక్కెనల మొలకెత్తిన ఆశల నారును కావడికెత్తుకొని
గజ్జల్లదాకా పారుతున్న బంటోనిబొందని దాటుకొని
గోరుకొయ్యల యాల్ల మోటగొట్టి
అనుబంధాల పంట పండిద్దామనే అనుకుంటం
మోటజార్ల మీద దగాపడ్డ దాపటెద్దు ఊపిర్లకు ఉరిపడ్తది
అమాస చీకట్ల అడవి గుండె పగిలి శోకం పెడ్తది
రియాజ్ రంగవల్లుల లెక్క దందెడ మళ్ళీ మళ్ళీ తెగిపడ్తనే వుంటది.
బొందపొలం మోకాలు బురదల ఇరువాలు దున్నుతున్నప్పుడు
మనసుకు కసుక్కున మాటల కాలుగర్రవడ్తది
నీరువెట్టి ఎరువుదోలి దుక్కెద్దుల గంగడోలు దువ్వి
విశ్వాసపు కోండ్ర వేసి కొమటోని బండనిండా పడుగు పెడ్దామని
తలకు రమాలు చుట్టి ములుగర్ర చేతబడితే
ఆశల ఒలపటెద్దుకు హఠాత్తుగా కాలుగర్రవడ్దది
జంగల్ మహల్ కూలవడ్డట్టు
దేహం అలసి సొలసి బాయికాడి రాతితెట్టెలెక్క కూలవడ్డది
మనసు చిల్లులు వడ్డ మోటబొక్కెన తొండం లెక్క
నీరుగారి చిక్కటి శూన్యమైంది – డా|| కాసుల లింగారెడ్డి
పగిలిన కలలు
- Advertisement -
- Advertisement -



