ఒకప్పుడు క్రీడలంటే కేవలం పురుషుల ప్రపంచంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మహిళలు కూడా క్రీడల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. దేశానికి పతకాల వర్షం కురిపిస్తున్నారు. ఇక వయసుతో సంబంధం లేకుండా ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే తమకు ఇష్టమైన క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారిణులు మన దేశంలో ఎందరో ఉన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు. శ్రమ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఈ రోజు అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొందరు క్రీడాకారిణుల పరిచయం నేటి మానవిలో…
కోనేరు హంపి…
రెండున్నర దశాబ్దాలుగా భారత మహిళల చెస్‌కు ప్రతినిధిగా వెలుగుతూ ఎన్నో గొప్ప విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు కోనేరు హంపి. ఈమె సొంత ఊరు విజయవాడ. ప్రస్తుతం 37 ఏండ్లు ఉన్న ఈమె రెండు సార్లు ప్రపంచ మహిళల ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. 2019లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించారు. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో పతకాలు గెలవడం అలవాటు చేసుకున్న హంపి 2024 డిసెంబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచారు. ఓఎన్‌జీసీలో చీఫ్ జనరల్ మేనేజర్ అయిన హంపి క్లాసిక్ ఫార్మట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
నూషిన్ అల్ ఖదీర్..
కర్ణాటకలోని గుల్బర్గాల్లో జన్మించి, ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డ నూషిన్ మంచి క్రీడాకారిణిగానే కాకుండా కోచ్‌గా కూడా నిరూపించుకున్నారు. 44 ఏండ్ల ఈమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మలేషియాలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు హెడ్‌గా కోచ్‌గా వ్యవహరించారు. 2023లోనూ తొలిసారి అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్‌లో నూషిన్ శిక్షణలోనే టీమిండియా విజేతగా నిలిచారు. నూషిన్ 2002 నుంచి 2012 వరకు భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఐదు టెస్టులు, 78 వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల్లో భారత్ తరపున బరిలోకి దిగారు. 2005లో ఆటలకు వీడ్కోలు చెప్పారు. తర్వాత కోచ్‌గా బాధ్యతలు తీసుకుని ఎందరో క్రీడాకారిణులను తీర్చిదిద్దుతున్నారు. నూషిన్ శిక్షణలో భారత టీనేజ్ క్రికెటర్లు వరుసగా రెండు టి20 ప్రపంచకప్‌లలో విజేతలుగా నిలిచి ఔరా అనిపించారు.
నిఖత్ జరీన్
తెలంగాణలోని నిజామాబాద్‌లో జూన్ 14, 1996న పుట్టిన నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో అద్భుత విజయాలు సాధించారు. చిన్న వయసులోనే బాక్సింగ్ కెరీర్ ప్రారంభించిన ఆమె.. తక్కువ కాలంలోనే గొప్ప బాక్సర్‌గా ఎదిగారు. 2011లో ఏఐబీఏ ఉమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 2014లో సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లోనూ సత్తాచాటి గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకున్నారు. 2019లో బల్గేరియాలోని సోఫియాలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్, 2021లో టర్కీలో జరిగిన ఇస్తాంబుల్ బోస్ఫరస్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటారు. ఇక 2022, 2023లో రెండుసార్లు ఆమె వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ గెలుచు కున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను, ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిరాశ పరిచారు. 2028లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించటమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆమె అర్జున అవార్డు కూడా అందుకున్నారు. గత ఏడాది జరీన్ డీఎస్పీగా ఉద్యోగంలో చేరారు.
జ్యోతి సురేఖ…
భారత మహిళల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో తిరుగులేని ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ. విజయవాడకు చెందిన 28 ఏండ్ల ఈ క్రీడాకారిణి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్నారు. 14 ఏండ్లుగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమె ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్ టోర్నీలలో కలిపి 50 పతకాలు సాధించారు.
జ్యోతి యర్రాజీ…
పాఠశాలలో పీటీ ఉపాధ్యాయుడు ఇచ్చిన సలహాతో అథ్లెటిక్స్‌లో అడుగు పెట్టి అతితక్కువ కాలంలోనే అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు వైజాగ్‌కు చెందిన జ్యోతి. 100 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డులు లిఖించుకున్న జ్యోతి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ భారత్ తరపున పోటీపడ్డ తొలి మహిళా అథ్లెట్‌గా ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి వరుసగా మూడు సార్లు జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 2024లో కేంద్రం నుంచి అర్జున అవార్డు అందుకున్నారు.
ఆకుల శ్రీజ…
టేబుల్ టెన్నిస్ భారత నంబర్‌వన్ ర్యాంకర్ అయిన శ్రీజ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. గత ఏడాది కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన 26 ఏండ్ల శ్రీజ వరల్డ్ టేబుల్ టెన్నిస్ సర్క్యూట్‌లో కంటెండర్ స్థాయి టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందారు. గత ఏడాది జూన్‌లో నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్ కంటెండర్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచారు. గతేడాది జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ లీగ్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిడిపై సంచలన విజయం సాధించారు. 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకున్నారు.
గుగులోత్ సౌమ్య..
జట్టు క్రీడ ఫుట్‌బాల్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే విశేష ప్రతిభ ఉండాల్సిందే. ఆ నైపుణ్యాన్ని సొంత చేసుకొని భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ జట్టులో ఫార్వర్డ్‌గా రాణిస్తున్నారు సౌమ్య. నిజామాబాద్ జిల్లాకు చెందిన 23 ఏండ్ల ఈమె అండర్-14, అండర్-19 విభాగాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం దేశవాళీ మహిళల ఫుట్‌బాల్ లీగ్‌లో విఖ్యాత ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఆడుతున్న సౌమ్య ఈ ఏడాది షార్జాలో జరిగిన పింక్ లేడీస్ కప్ నాలుగు దేశాల అంతర్జాతీయ టోర్నీలో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.