No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంరాజకీయాల్లో ఆమెకు రక్షణ కరువు

రాజకీయాల్లో ఆమెకు రక్షణ కరువు

- Advertisement -

పోష్‌ యాక్ట్‌ పరిధిలోకి రాని పార్టీలు జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
వేధింపుల భయంతో రాజకీయాల్లోకి రావటానికి జంకుతున్న మహిళలు

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించి మహిళలకు సురక్షితమై వాతావరణాన్ని సృష్టించటం కోసం 2013లో పోష్‌యాక్ట్‌ను తీసుకొచ్చారు. అయితే భారత్‌లోని రాజకీయ పార్టీలు మాత్రం ఈ యాక్ట్‌ పరిధిలో లేవు. వాటిని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల్లో లైంగికవేధింపులు, హింస, బెదిరింపులు వంటి విషయాలకు భయపడి మహిళలు రాజకీయాల్లోకి రావటానికి జంకుతున్నారు. అయితే మహిళల భద్రత గురించి ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ పార్టీలు మాత్రం ఈ చట్టం పరిధిలోకి తమ పార్టీలు వచ్చేలా చర్యలు తీసుకోవటం లేదు. పోష్‌ చట్టం కింద తప్పనిసరి అయిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీగా ఉన్న సీపీఐ(ఎం) ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
న్యూఢిల్లీ : దేశంలోని మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఇప్పటికీ పని ప్రదేశాల్లో శారీరక, మానసిక వేధింపులు తగ్గుముఖం పట్టట్లేదు. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు కూడా అంతగా శ్రద్ధ పెట్టకపోవటంతో స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో వారి రక్షణ కోసం వచ్చిందే ‘మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం-2013’. దీని సంక్షిప్త నామమే పోష్‌ యాక్ట్‌. 2013, డిసెంబర్‌ 9న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది మహిళలకు భద్రత, గౌరవ ప్రదమైన పని ప్రదేశాన్ని కల్పిస్తుంది. పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని పని ప్రదేశాల్లో, పబ్లిక్‌, ప్రయివేటు సెక్టార్లు, కార్పొరేటు ఆఫీసులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఎన్జీఓలు, ఇండ్లల్లోని పనులకు సంబంధించి ఈ చట్టం వర్తిస్తుంది. పని ప్రదేశాల్లో భౌతికంగా తాకడం, లైంగిక ప్రయోజనాలు కోరటం, పోర్న్‌ చిత్రాలు చూపించటంతో పాటు లైంగికంగా మాటలు, సంజ్ఞలు వంటివి ఈ చట్టం కింద వేధింపుల కిందకే వస్తాయి. చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు తప్పనిసరి. ఇందులో సీనియర్‌ మహిళా ఉద్యోగి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఉంటారు. ఐసీసీ తమ వద్దకు వచ్చే ఫిర్యాదులు, విచారణలపై దృష్టి సారిస్తుంది. ఇక పది మంది కంటే తక్కువగా ఉద్యోగులున్న సంస్థల విషయంలో జిల్లా అధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ(ఎల్‌సీసీ)ని ఏర్పాటు చేస్తారు.

పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు
అయితే ఈ చట్టం రాజకీయ పార్టీలకు వర్తించటం లేదు. పలు రాజకీయ పార్టీల్లో మహిళలు లైంగికవేధింపులు, హింస, బెదిరింపులను ఎదుర్కొంటున్న సంఘటనలూ అనేకం ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలను పోష్‌ చట్టం కిందకు తీసుకురావాలని దాఖలైన రిట్‌ పిటిషన్‌ భారత సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైంది. అయితే న్యాయస్థానం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈనెల 1న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ గవాయ్ నేతృత్వంలోని ఓ బెంచ్‌ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

వాస్తవానికి ఓ కేసు విచారణ సందర్భంగా 2022లో కేరళ హైకోర్టు రాజకీయ పార్టీలు అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ”రాజకీయ పార్టీలు వాటి సభ్యులతో యజమాని-ఉద్యోగి సంబంధాన్ని కలిగి ఉండకపోతే, చట్టంలో నిర్వచించినట్టుగా ‘పని ప్రదేశం’ నిర్వచనంలోకి రాకపోతే, అక్కడ ఎలాంటి అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉండదు” అని హైకోర్టు వివరించింది. సుప్రీంకోర్టు కూడా దాదాపు ఇదే విషయాన్ని చెప్పింది. ఈ విషయం విధాన రూపకర్తలు, పార్లమెంటు పరిధిలోనిదనీ, కోర్టు చేతుల్లో లేదని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌ గవారు అన్నారు.

కోర్టు తీర్పుతో షాక్‌
అయితే సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని మహిళలు, ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలన్న తపన ఉండి, పురుషాధిక్య వాతావరణంలో ముందుకెళ్లలేకపోతున్న చాలా మందికి షాక్‌ను కలిగించింది. రాజకీయ పార్టీలను పోష్‌ చట్టం పరిధిలోకి తీసుకురాకపోవటంతో ఎందరో మహిళలకు రాజకీయ పార్టీల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారు. దీంతో వారు రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నారని మహిళల కోసం పని చేసే నేత్రి ఫౌండేషన్‌ భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)కి పలు సందర్భాలో విజ్ఞప్తి చేసింది. అయితే ఈసీఐ నుంచి ఎలాంటి స్పందనా లేదు.

రాజకీయాల్లో మహిళల పరిస్థితి దారుణం
భారతదేశ రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం చాలా దారుణంగా ఉంది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో వారి జనాభాకు తగిన వాటా దక్కటం లేదు. ఐక్యరాజ్యసమితి 2014లో ప్రచురించిన నివేదిక ప్రకారం లైంగికవేధింపులు, హింస వంటి కారణాలతో దక్షిణాసియా దేశాలలోని మహిళలు రాజకీయాల్లోకి రావటానికి జంకుతున్నారు. దాదాపు 50 శాతం మంది మహిళలు మాటల ద్వారా, 45 శాతం మంది శారీరకంగా వేధింపులను, ప్రత్యేకించి ఎన్నికల ప్రచారాల సందర్భంగా ఎదుర్కొన్నట్టు చెప్పారు. భారత్‌లో 2003 నుంచి 2013 మధ్య మహిళా అభ్యర్థులు శారీరక హింస, బెదిరింపులను ఎదుర్కొన్నారు.

ఐసీసీని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ సీపీఐ(ఎం)
భారత్‌లోని రాజకీయ పార్టీల్లో సభ్యత్వానికి సంబంధించి పురుషులు, మహిళలు ఎంత మంది చేరుతున్నారన్నదానిపై స్పష్టత లేదు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఈ తీరు కనబడింది. అయితే ఒక్క సీపీఐ(ఎం) మాత్రమే తమ పార్టీ సభ్యత్వంలో మహిళల సంఖ్య గురించి స్పష్టమైన సమాచారంతో ఉంది. 2024లో మొత్తం ఒక కోటి సభ్యత్వంలో 20 శాతం మంది (20 లక్షల మంది) మహిళలు ఉన్నట్టు నివేదించింది. పోష్‌ చట్టం కింద అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి, దానిని పార్టీ వెబ్‌ పేజీలో పెట్టిన ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమే కావటం గమనార్హం. బీజేపీలో 3.5 కోట్ల మంది, కాంగ్రెస్‌లో 2.3 కోట్ల మంది మహిళా సభ్యత్వం ఉన్నదని చెప్తున్నా.. వాటి మొత్తం సభ్యత్వంలో మహిళల సంఖ్య తక్కువే. అలాగే ఈ పార్టీలు చెప్పే సమాచారంలోనూ విశ్వసనీయత కరువైందని విశ్లేషకులు చెప్తున్నారు. రెండువేలకు పైగా రాజకీయ పార్టీలను కలిగి ఉన్న భారత్‌లో కేవలం మూడు పార్టీలు మాత్రమే మహిళల రాజకీయ పార్టీ సభ్యత్వంపై ప్రాథమిక డేటాను నమోదు చేయటం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad