నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తన మిత్రుడు, నటుడు విజయ్‌కు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకమైన సలహా ఇచ్చారు. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా, ఆచితూచి వేయాలని ఆయన సూచించారు. ఇటీవల తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన శివరాజ్ కుమార్, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
విజయ్ రాజకీయ ప్రవేశాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, అయితే ఇటీవలి కరూర్ తొక్కిసలాట వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని గుర్తుచేశారు. కరూర్ ఘటన ఎలా జరిగిందనే దానిపై తనకు పూర్తి సమాచారం లేనప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విజయ్ తన రాజకీయ వ్యూహాలను మరింత పదునుపెట్టి ముందుకు సాగాలని శివరాజ్ కుమార్ ఆకాంక్షించారు. స్నేహితుడిగా విజయ్‌కు ఈ సూచన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.