వర్క్ పర్మిట్లపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ ల కాలవ్యవధిని కుదిస్తున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. శరణార్థులు, ఆశ్రయం పొందాలనుకునేవారు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ (ఈఏడీ) కింద అనుమతులు జారీ చేస్తారు. దీనికి ఐదేండ్ల కాలవ్యవధి ఉండేది. తాజా సవరణలతో దాన్ని 18 నెలలకు కుదించారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ఇటీవల అధ్యక్ష భవనానికి సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోకి వలస వచ్చేవారిపై కఠిన సమీక్షలు అవసరమని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం భావిస్తోంది. ఈ క్రమంలోనే వర్క్ పర్మిట్ల కాలవ్యవధిపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఏంటీ ఈఏడీ?
ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) అనేది ఓ వ్యక్తికి నిర్దిష్ట కాలవ్యవధి వరకు అమెరికాలో పని చేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇది ఉంటేనే వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు లభిస్తాయి. గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, ఎఫ్-1, ఎం-1 వీసాలపై వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలపై వచ్చేవారు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ ఈఏడీ పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
ట్రంప్ ఖాతాలు సంపద సృష్టిస్తాయా ?
అమెరికాలో ‘ట్రంప్ ఖాతాలు’ సంపద సృష్టించుకునేందుకు అల్పాదాయ వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందా? దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన పన్ను-వ్యయ బిల్లులో ఈ పెట్టుబడి కార్యక్రమం ఓ భాగంగా ఉంది. అయితే దీనికి సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికీ తెలియడం లేదు. ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం జూలై 4న ప్రారంభమవుతుంది. దీని ప్రకారం…2025-2028 మధ్య కాలంలో జన్మించే పిల్లల కోసం పెట్టుబడి ఖాతాల్లో అమెరికా ఆర్థిక శాఖ వెయ్యి డాలర్ల సీడ్ మనీ చొప్పున డిపాజిట్ చేస్తుంది. ప్రతి ఖాతాకూ సామాజిక భద్రతా నెంబరును కేటాయిస్తారు. ఖాతాల్లో జమ చేసిన సొమ్మును ప్రభుత్వం తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ నిధుల్లో పెట్టుబడి పెడుతుంది. అది పెరుగుతూ ఉంటుంది. పిల్లల ఖాతాల్లో తల్లిదండ్రులు, గార్డియన్లు, యజమానులు, లేదా ఏ ఇతర సంస్థ అయినా నిధులను జమ చేయవచ్చు. అయితే వారు జమ చేసే మొత్తం ఏడాదికి ఐదు వేల డాలర్లు దాటకూడదు.



