నవతెలంగాణ హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు బాండి బీచ్‌లో ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు గన్‌మెన్లు ఒక్కసారిగా ఫైరింగ్ మొదలుపెట్టారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నల్ల ముసుగులు వేసుకొని ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారు. అక్కడ జరుగుతున్న ఒక ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం మేరకు 10 మంది మృతి చెందినట్టు ఆస్ట్రేలియా పత్రికలు పేర్కొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఓ దుండగుడిని కాల్చి చంపాయి. మరొకడిని అదుపులోకి తీసుకొన్నాయి. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి.



