30శాతం వేతనాన్ని పెంచితేనే హాజరుకావాలి : తెలుగు ఫిల్మ్ ఇండిస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం
హైదరాబాద్ : నేటి (సోమవారం) నుంచి 30శాతం వేతనాన్ని పెంచిన నిర్మాతల చిత్రాల షూటింగ్‌లకు మాత్రమే హాజరు కావాలని లేనిపక్షంలో షూటింగ్‌లకు హాజరు కావద్దని పరిశ్రమలోని 24 క్రాప్ట్స్‌కి సంబంధించి కార్మిక సంఘాల నాయకులకు తెలుగు ఫిల్మ్ ఇండిస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (టీఎఫ్‌ఐఈఎఫ్) సూచించింది. కార్మికుల వేతనాల పెంపు విషయమై గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాలకు, నిర్మాతలకు మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆదివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. ఈ మేరకు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ కీలక నిర్ణయాల్లో భాగంగా వేతనాల పెంపు విషయంలో కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మెన్‌లుగా సయ్యీద్ హుమయన్, వీరశంకర్‌ను నియమించారు. వీరు నేటి (సోమవారం) నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పెంచిన వేతనాలు ఇస్తామని ప్రొడ్యూసర్ నుంచి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్‌లకు తెలియజేసిన తరువాత మాత్రమే కార్మికులు విధులకు వెళ్ళాలని నిర్ణయించారు. అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండిస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు సంబంధించిన యూనియన్ లేదా అసోసియేషన్ సభ్యులెవరూ సినిమాలకు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లకు, ఫెడరేషన్ నుంచి అనుమతి లేనిదే ఎటువంటి విధులకూ హాజరు కాకూడదని నిర్ణయించారు. అలాగే ఈ నియమాలు తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తిస్తుందని, ఇతర భాషా చిత్రాలకు కూడా వర్తిస్తుందని ఫెడరేషన్ పేర్కొంది.గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేయగా, కేవలం 5 శాతం వేతనాన్ని మాత్రమే పెంచి ఇస్తామని నిర్మాతలు అనడంతో ఫెడరేషన్ పైనిర్ణయాలు తీసుకుందని అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి తెలిపారు.
అల్లరి నరేష్ సినిమా ఓపెనింగ్ వాయిదా
ఫెడరేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో నేడు (సోమవారం) ఉదయం ప్రారంభం కావాల్సిన హీరో అల్లరి నరేష్ సినిమా ఓపెనింగ్ వాయిదా పడింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎమర్జెన్సీ మీటింగ్
ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై చర్చించేందు కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎమర్జెన్సీ మీటింగ్‌కి పిలుపునిచ్చింది. నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్‌కి నిర్మాతలందరూ రావాలని తెలిపింది. ఈ మేరకు ఎమర్జెన్సీ మీటింగ్ పై ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం
ఫెడరేషన్ పక్షపాతంగా 30 శాతం వేతనాల పెంపును డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి, లేని వర్కర్లకు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం.
– కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
నేటి నుంచి షూటింగులు బంద్ ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES