Sunday, July 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబాధిత చిన్నారుల పట్ల సున్నితంగా వ్యవహరించాలి

బాధిత చిన్నారుల పట్ల సున్నితంగా వ్యవహరించాలి

- Advertisement -

సమాజంలో భద్రత ఉందనే భరోసానివ్వాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌
బాల్యాన్ని తిరిగివ్వడమే న్యాయం
సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

లైంగిక వేధింపుల బాధిత చిన్నారుల పట్ల వ్యవస్థ మరింత సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సూచించారు. న్యాయం చేసే క్రమంలో పిల్లల మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థతో సహా భాగస్వాములైన ప్రతి విభాగం, అధికారులు సున్నితంగా కేసులను పరిష్కరించడంలో మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, మహిళా భద్రతా విభాగం, యునిసెఫ్‌, తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్‌లో ”నోరు లేని వారి గొంతుక – లైంగిక వేధింపులకు గురైన చిన్నారుల హక్కులు, భద్రత”పై సంబంధిత భాగస్వాముల సంప్రదింపుల రాష్ట్రస్థాయి సమావేశాలు -2025 ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి శనివారం జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్యఅతిథిగా హాజరు కాగా సీఎం రేవంత్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోరు పాల్‌, డీజీపీ జితేందర్‌, యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌ కాఫ్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకాంత్‌ మాట్లాడుతూ లైంగిక వేధింపుల బారిన పడినవారు రకరకాల మానసిక రుగ్మతల బారిన పడే అవకాశాలెక్కువనీ, డిప్రెషన్‌కు గురై కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారని అన్నారు. వారికి పునరావాసం కల్పించడం ముఖ్యమని గుర్తుచేశారు. కోర్టు నాలుగు గోడల మధ్య భద్రంగా ఉన్నామని భావిస్తే సరిపోదనీ, ఆ గోడల ఆవల భద్రతకు భరోసా ఉందనే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. పిల్లల భద్రత అందరి సమిష్టి బాధ్యత అని తెలిపారు. వారిని కాపాడు కోలేకపోతే దేశం తన ఆత్మను కోల్పోయినట్టేనని వ్యాఖ్యానించారు. పిల్లలను నిర్లక్ష్యం చేస్తే దేశ భవిష్యత్తును కోల్పోతామని హెచ్చరించారు.


బాల్యాన్ని తిరిగివ్వడమే న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
లైంగిక వేధింపుల బాధిత చిన్నారులకు న్యాయం చేయడమంటే నేరస్తులను శిక్షించడం ఒక్కటే కాదని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. బాధితులకు భరోసా కల్పించి, వారికి అవసరమైన రక్షణనిచ్చి, తగిన గౌరవాన్ని అందించి వారికి బాల్యాన్ని వారికి తిరిగి ఇవ్వడమే సరైన న్యాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలు, చిన్నారుల భద్రత అత్యంత ప్రాధాన్యమైనవని తెలిపారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలను నియంత్రించి బాధితులకు చట్టపరంగా అన్ని రకాల రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం ”భరోసా” ప్రాజెక్టును తీసుకొచ్చిందనీ, దానికి అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా పోలీసు సహాయమే కాకుండా న్యాయపరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సేవలను అందిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ కేంద్రాల లక్ష్యమని వివరించారు. పోక్సో చట్టం, జువైనల్‌ చట్టాలు ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియా ద్వారా పిల్లలపై జరిగే దురాగతాలు, దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపకుండా దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పిల్లలకు న్యాయం అందించడంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని సీఎం సూచించారు.
పిల్లల సంరక్షణకు అన్ని విభాగాలు ఒకే వేదికగా పనిచేయాలి
పిల్లల సంరక్షణకు అన్ని విభాగాలు ఒకే వేదికగా పని చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోరు పాల్‌ సూచించారు. ఏ విభాగానికి ఆ విభాగం కేసులను పరిష్కరించే క్రమంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇతర విభాగాలతో చర్చించాలని తెలిపారు. డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ కోర్టు వ్యవస్థ పిల్లలకు ఫ్రెండ్లీగా ఉండాలని ఆకాంక్షించారు. బాధితులకు సకాలంలో పరిహారం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌ కాఫ్రే ప్రపంచంలో, దేశంలో చిన్నారుల పరిస్థితిని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -