విజయ్ హజారే ట్రోఫీ
ముంబయి : ప్రాణాంతక గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెడుతున్న శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో ముంబయికి సారథ్యం వహించనున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సీఓఈ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది. ఈ నెల 2న బెంగళూరులోని సీవోఈలో జరిగిన మ్యాచ్‌లో ఎటువంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు ఇతర ఫిట్‌నెస్ డ్రిల్స్ చేసిన శ్రేయస్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.
ముంబయికి సారథ్యం వహిస్తున్న పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ గాయంతో టోర్నమెంట్‌కు దూరమవగా.. గ్రూప్ దశలో చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహిస్తాడని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సిలో ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబయి నాలుగు విజయాలు సాధించి నాకౌట్ బెర్త్ లాంఛనం చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో, ఆఖరు మ్యాచ్‌లో పంజాబ్‌తో ముంబయి తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ముంబయికి అయ్యర్ కెప్టెన్సీ వహిస్తాడు. మరోవైపు ఎలైట్ గ్రూప్-బిలో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు చవిచూసిన హైదరాబాద్ నేడు రాజ్‌కోట్‌లో బెంగాల్‌తో తలపడనుంది.



