– ప్లీహానికి చీలికతో అంతర్గత రక్తస్రావం!
– సిడ్నీకి బయల్దేరిన క్రికెటర్ కుటుంబం
నవతెలంగాణ-సిడ్నీ : భారత క్రికెటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డేలో బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి వెనక్కి పరుగెడుతూ కండ్లుచెదిరే క్యాచ్ అందుకుని ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కేరీని అవుట్ చేసిన సంగతి తెలిసిందే. కఠినమైన క్యాచ్‌ను మెరుపు వేగంతో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. వెంటనే పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడాడు. బీసీసీఐ వైద్య బృందం శ్రేయస్ అయ్యర్‌కు తక్షణ చికిత్స చేసినా.. నొప్పి తీవ్రత దృష్ట్యా అతడిని లోకల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
ప్లీహానికి చీలిక :
శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకల గాయానికి గురైనట్టు శనివారం బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్టు వెల్లడించింది. వైద్య పరీక్షల్లో శ్రేయస్ అయ్యర్ ప్లీహాం చీలిక గాయానికి గురైనట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ప్లీహాంలో చీలికతో శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్లీహానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. లేదంటే, చీలిక వచ్చిన ప్లీహం భాగాన్ని తొలగించాల్సి ఉంటుందని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ ప్లీహాం చీలిక గాయానికి గురైనా.. ఆ గాయం తీవ్రత, తదుపరి వైద్య చికిత్స వంటి వివరాలను ఆసుపత్రి వర్గాలు, బీసీసీఐ వైద్యులు నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగ్గా కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
సిడ్నీకి శ్రేయస్ కుటుంబం :
శనివారం గాయపడిన శ్రేయస్ అయ్యర్ ఇంకా ఐసీయూలోనే ఉండటం, ప్రాణాపాయ ప్లీహాం చీలిక గాయం ఆందోళనతో స్టార్ క్రికెటర్ కుటుంబ సభ్యులు సోమవారం సిడ్నీ బయల్దేరారు. తొలుత శ్రేయస్ అయ్యర్ చెల్లెలు సిడ్నీ వెళ్తుందని, అందుకు అవసరమైన వీసా అనుమతుల జారీకి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. కానీ, తాజాగా శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రత, అతడు సుమారు మరో వారం రోజుల పాటు సిడ్నీ ఆసుపత్రి ఐసీయూలోనే ఉండనుండటంతో అతడి తల్లిదండ్రులు సైతం సిడ్నీకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ పర్యవేక్షిస్తోంది.
ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
- Advertisement -
- Advertisement -



