ప్రస్తుతం నిలకడగా అయ్యర్ ఆరోగ్యం
సిడ్నీ (ఆస్ట్రేలియా) : భారత క్రికెటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్లీహాం గాయం నుంచి కోలుకుంటున్నాడు. శనివారం సిడ్నీలో జరిగిన భారత్, ఆస్ట్రేలియా ఆఖరు వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ అందుకుంటూ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ తొలుత ఎడమ పక్కటెముల గాయానికి గురైనట్టు భావించినా.. వైద్య పరీక్షలో ప్రాణాంతక ప్లీహాం చీలిక గాయం బారినట్టు తేలింది. ప్లీహాంలో చీలికతో అంతర్గత రక్తస్రావం జరిగింది. సిడ్నీలోని ఓ హాస్పిటల్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ప్లీహాం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
నిలకడగా అయ్యర్ ఆరోగ్యం :
శ్రేయస్ అయ్యర్‌కు ప్లీహాం సర్జరీ విజయవంతం కాగా.. ప్రస్తుతం అతడి నిలకడగా ఉందని, మెరుగ్గా కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. ‘శ్రేయస్ అయ్యర్ గాయం వేగంగా గుర్తించారు. దీంతో రక్తస్రావం అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అయ్యర్ పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్నా.. మంగళవారం మరో స్కానింగ్ జరిగింది. అయ్యర్ వేగంగా కోలుకుంటున్నాడని పరీక్షలో తేలింది. శ్రేయర్ కోలుకునే ప్రక్రియ మొదలైంది. బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీ సహా భారత్‌లోని వైద్య నిపుణులు శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.



