సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం
ఇషాన్ కిషన్, రింకూ సింగ్ ఎంపిక
జట్టులో స్థానం కోల్పోయిన జితేశ్ శర్మ
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ భారత జట్టు ప్రకటన
సీనియర్ సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. స్వదేశంలో జరుగనున్న ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ బరిలో నిలిచే భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ జట్టులో నిలువగా.. వికెట్ కీపర్ జితేశ్ శర్మకు నిరాశ తప్పలేదు.
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ 2026 మెన్స్ టీ20 ప్రపంచకప్ వేటకు గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు. జట్టు సమతూకం, ఫామ్, సమతౌల్యత పరగణనలోకి తీసుకుంటూ సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. శనివారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టును ఎంపిక చేయగా.. ఈ సమావేశానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ కోచ్ గౌతం గంభీర్ హాజరయ్యారు. తుది జట్టు కూర్పుపై ప్రధానంగా చర్చించిన సీనియర్ సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ఆరంభం కానుండగా.. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా ప్రపంచకప్ బరిలో దిగుతుంది. ఇదే జట్టు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి ఆరంభం కానున్న న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఆడుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించనుండగా.. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
కూర్పు కోసం..
వైస్ కెప్టెన్‌గా టీ20 జట్టులో పునరాగమనం చేసిన శుభ్‌మన్ గిల్‌ను కూర్పు కోసం పక్కనపెట్టినట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. పొట్టి ఫార్మాట్‌లో రీ ఎంట్రీ తర్వాత శుభ్‌మన్ గిల్ 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్థ సెంచరీ సాధించలేదు. టాప్ ఆర్డర్‌లో ప్రభావశీల ఇన్నింగ్స్ ఒక్కటీ నమోదు చేయలేదు. అయితే, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోలేదని.. తుది జట్టు కాంబినేషన్స్ కోసం గిల్‌ను పక్కనపెట్టామని వెల్లడించారు. అభిషేక్ శర్మతో పాటు ఓపెనర్‌గా వికెట్ కీపర్‌ను ఆడించాలనే ఆలోచనతో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చారు. ఇదే విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం స్పష్టం చేశాడు.
జితేశ్ శర్మ అవుట్
శుభ్‌మన్ గిల్‌పై వేటుతో జట్టులో పలు మార్పులు చేయాల్సి వచ్చింది. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చినా.. పరోక్షంగా ఇతర స్థానాలు ప్రభావితం అయ్యాయి. గిల్ తుది జట్టులో ఉండగా తొలి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా కొనసాగిన జితేశ్ శర్మ ఇప్పుడు చోటు గల్లంతు చేసుకున్నాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్లు, వికెట్ కీపర్లు జట్టులో ఉండటంతో జితేశ్ శర్మకు భంగపాటు తప్పలేదు. జితేశ్ శర్మను పక్కనపెట్టడంతో లోయర్ మిడిల్ ఆర్డర్‌లో మరో క్రికెటర్‌ను ఎంచుకునే వెసులుబాటు లభించింది. స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్, స్పిన్ ఆల్‌రౌండర్ ఓ స్థానం కోసం పోటీపడ్డారు. కానీ జితేశ్‌పై వేటుపై జట్టులో ఇద్దరికీ చోటు లభించింది. గత ప్రపంచకప్ జట్టులో తృటిలో చోటు కోల్పోయిన రింకూ సింగ్ ఈసారి స్వదేశంలో ధనాధన్‌కు సిద్ధం కానున్నాడు.
ఊహించినట్టుగానే
టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ ఉండగా.. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మిడిల ఆర్డర్‌లో నిలిచారు. జశ్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలు స్పెషలిస్ట్ పేసర్లుగా.. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా జట్టులో నిలిచారు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె పేస్ ఆల్‌రౌండర్లు కాగా.. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్‌రౌండర్లు.
ఇషాన్ అదిరే ఎంట్రీ
2023 ఆస్ట్రేలియాతో చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు ఇషాన్ కిషన్. మానసిక ఆరోగ్యంతో జాతీయ జట్టుకు దూరమైనా.. క్రమశిక్షణ ఇతర కారణాలతో ఇషాన్‌ను బీసీసీఐ పక్కనపెట్టింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కిషన్‌ను తప్పించింది. అయినా, ఇషాన్ కిషన్ కుంగలేదు. దేశవాళీ క్రికెట్‌లో తన నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాడు. భారత్-ఏ తరఫున, దేశవాళీ సర్క్యూట్‌లో జార్ఖండ్ తరఫున రాణించాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో జార్ఖండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో హర్యానాపై సెంచరీ సహా టోర్నమెంట్‌లో 517 పరుగులు సాధించాడు. త్రిపురపై సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. సౌరాష్ట్రపై 93, మధ్యప్రదేశ్‌పై 63, పంజాబ్‌పై 47 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు.
కెప్టెన్‌గా జార్ఖండ్‌ను ముందుండి గెలుపు పథంలో నడిపించిన ఇషాన్ కిషన్ సెలక్షన్ కమిటీ విస్మరించలేని స్థాయిలో రాణించాడు. రెండు సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత నేరుగా ప్రపంచకప్ బరిలో నిలువనున్నాడు. ‘ఇది అత్యంత సంతోషకరమైన సందర్బం. నా కెప్టెన్సీలో జార్ఖండ్ దేశవాళీ చాంపియన్‌గా నిలువటం గొప్పగా ఉంది. నేను మంచిగా రాణించినా.. జట్టులో చోటు దక్కలేదు. అప్పుడు నేను డీలా పడలేదు. జట్టులో కోసం ఇంతకంటే బాగా ఆడాలని అనుకున్నాను. బ్యాటింగ్ నైపుణ్యంపై ఎక్కువగా దృష్టి సారించాను. ఇప్పుడు బలహీనతలు నాకు తెలుసు. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాను. జాతీయ జట్టులోకి రావటం సంతోషంగా ఉంది’ అని ఇషాన్ కిషన్ అన్నాడు.
2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).



