ఏటా సగటున 2961 ఫెయిల్యూర్స్
సిగ్నలింగ్ వ్యవస్థల విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం : కాగ్ నివేదిక
న్యూఢిల్లీ : దక్షిణ పశ్చిమ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) జోన్ సిగ్నల్ వైఫల్యాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆందోళనను వ్యక్తం చేసింది. ఏడాదికి సగటున దాదాపు 2961 సిగ్నల్ ఫెయిల్యూర్స్ నమోదవుతున్నాయని వివరించింది. ఇది అక్కడి సిగ్నలింగ్ వ్యవస్థల విశ్వసనీయత, అందుబాటుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నది. లోక్‌సభలో సమర్పించిన కాగ్ నివేదికలో ఇది వెల్లడైంది. 2018-19 నుంచి 2022-23 వరకు హుబ్బళి, బెంగళూరు, మైసూరు డివిజన్లలోని సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్( ఎస్ అండ్ టీ) విభాగం పని తీరును కాగ్ ఆడిట్ పరిశీలించింది. ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఎర్ర సిగ్నల్ దాటడం (స్పాడ్), ఇంటర్‌లాకింగ్ వల్ల ఇప్పటికే ఆక్రమించబడిన లైన్‌కు రైళ్లు మళ్లే ప్రమాదం వంటి ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని కాగ్ పేర్కొన్నది. సిగ్నలింగ్ విభాగానికి సరిపడా సమయం ఇచ్చి రైళ్లను నిలిపివేసినా.. సిగ్నల్ వైఫల్యాలు భారీగా కొనసాగుతున్నాయని వివరించింది.
భద్రతా ఆడిట్లలో గుర్తించిన లోపాలు పదేపదే పునరావృతమవుతున్నాయని, ఇది నిరంతర పర్యవేక్షణ లేకపోవడాన్ని సూచిస్తున్నదని నివేదిక స్పష్టం చేసింది. భద్రతా విభాగం సూచించిన లోపాలను సరిచేయడంలో తీవ్ర జాప్యాలు జరిగినట్టు ఆడిట్ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్ పనులు జరుగుతున్న విషయాన్ని కాగ్ గుర్తించింది. రైల్వే బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇవ్వకుండా, అనుమతులు పొందకుండా సిగ్నలింగ్ పరికరాలను డిస్‌కనెక్ట్, రీకనెక్ట్ చేసిన ఘటనలు ఉన్నాయని కాగ్ వివరించింది. రైళ్లు ఢీకొనే ప్రమాదాలను నివారించేందుకు రూపొందించిన కవచ్ వ్యవస్థను 2020-21లో రూ.469 కోట్ల వ్యయంతో 1563 రూట్ కిలోమీటర్లకు మంజూరు చేసినప్పటికీ.. మూడేండ్లు గడిచినా అంచనా కూడా సిద్ధం కాలేదని కాగ్ విమర్శించింది. కాగ్ కొన్ని సిఫారసులు కూడా చేసింది. ”సిగ్నలింగ్ నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థంగా చేయాలి. నిబంధనల ప్రకారమే డిస్‌కనెక్షన్, రీకనెక్షన్ చేయాలి. సిబ్బందికి కౌన్సిలింగ్, కఠిన శిక్షలు అమలు చేయాలి. భద్రతా తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని” అని సూచించింది.
రైల్వేలో సిగ్నల్ వైఫల్యాలు
- Advertisement -
- Advertisement -



