రజిత వెళ్లిపోయింది, అది నా చెల్లెలు!
వ్యవస్థీకృత ఉద్యమాల మాతృమూర్తే మమ్మల్ని కలిపింది!
రక్త బంధాలకన్న రాఖీబంధాల కన్నా
అమలిన మనోబంధమే నన్నో అన్నను చేసింది!
పిడుగులాంటి సమాచారాన్ని
నా గడపముందు పత్రిక వదిలేయడం వల్లే తెలిసింది!
అది అచ్చం మన ఉద్యమంలానే ఉండేది
మీరు చూశారో లేదోగానీ
నలుగురు పిడికిలెత్తే చోట కళ్లముందు కదిలేది!
మహిళాలోకాన్ని అడగాల్సిన అవసరమే లేదనుకుంట
శోభా… నీకేమైనా చెప్పివెళ్లిందా!
మొన్నే ఓ మీటింగుకు వచ్చింది!
పక్కనే కూసుని యేవేవో తలపోసింది!
కాత్యాయయని తోడుందికదా అనుకున్నాను గానీ
రజిత దీపమిలా కొండెక్కుతుందనుకోలేదు!
ఫోన్లు చేసుకున్నప్పుడల్లా శంకరంగారూ అనేది
ఈ గారేంటి రజితా అంటే అది నాకు ఊతపదం కాదనేది
అలాగే రజితగారూ అంటే పగలబడి నవ్వేది
మన కవయిత్రుల అస్తిత్వానికి ఆద్యురాలివి నీవేనంటే
వాళ్లస్సలు కవయిత్రినే కాదంటారని దు:ఖపడేది!
నువ్వు పడిలేచిన కెరటానివంటే
పడిలేస్తున్న ప్రజలున్నప్పుడు లేచిపడే
కెరటాన్ని ఎలా అవుతాననేది!
ముందోమాట వెనుకోమాటగాళ్ల ముందు
చిట్లిన పత్తిమొగ్గయ్యేది
ఆమె రెండు కళ్లెప్పుడు బండిని మోసే
రెండెడ్లలా వుండేవి కూడ!
ఉద్యమ ప్రయాణాన్నంతా కవనకళలో భద్రంగానే దాచుకుంది
మన వెలుగుల్లో తన వెలుగును
ఒక వీలునామాగా భద్రపరిచింది
రజితా! నువ్వు సంధించిన నారివి!
ఉద్యమ శంఖాన్ని ఊదే హన్మకొండవి!
అనంత రణశ్వాసలో కలిసిన దానా!
నీ మనోదు:ఖాన్ని నెత్తినెత్తుకుని ఎలా ఓదార్చను చెప్పు!
డా||నాళేశ్వరంశంకరం, 9440451960
రజిత రణం!
- Advertisement -
- Advertisement -