– పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేయాలి
– ప్రమాణాలు పాటించకుండా
– జైలు శిక్ష నిబంధనలకు తూట్లు : ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టరేట్ వద్ద ధర్నాలో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాజమాన్యాలకు అధిక లాభాలు కట్టబెట్టేందుకు చట్టాలు సరళీకరించడం, పరిశ్రమల్లో అధికారులు సరైన తనిఖీలు చేపట్టకపోవడం వల్లే సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగిందని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు నొక్కి చెప్పారు. గతంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే జైలు శిక్ష విధించే నిబంధనలుండేవనీ, ప్రస్తుతం దానికి పాలకులు తూట్లు పొడిచారని విమర్శించారు. అన్ని పరిశ్రమల్లోనూ భద్రతా ప్రమాణాలపై తరుచూ తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టరేట్ వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, టీయూసీఐ, బీర్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, జె.చంద్రశేఖర్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అనురాధ, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకె. బోస్, బీఆర్‌టియు రాష్ట్ర కార్యదర్శి కెవిఎన్. రవికుమార్, సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు అశోక్, హైదరాబాద్ అధ్యక్షులు జె. కుమారస్వామి, హైదరాబాద్ సౌత్ అధ్యక్షులు మీనా, ఏఐటీయూసీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ”సిగాచి” ఫార్మా కంపెనీలో ప్రమాదంలో మరణించిన వారికి కోటి రూపాయల పరిహారం తక్షణమే చెల్లించాలనీ, కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలనీ, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చెల్లించి ప్రభుత్వమే వారి బాధ్యత తీసుకొవాలని కోరారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడానికే పరిమితం కాకుండా కార్మికుల రక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్షణ విషయంలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పొందిందంటున్న ”సిగాచి”లో ఇంత పెద్ద పేలుడు సంభవించడానికి కారణం ప్రభుత్వ విధానపరమైన లోపాలు తప్ప మరొకటి కాదని చెప్పారు. యాజమాన్యాలను సంతృప్తిపరచడం, వ్యాపారం సులభతరం చేయడం కోసం కార్మికుల ప్రాణాలను పాలకులు ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. పరిశ్రమల్లో ప్రమాదాలకు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలని కోరారు. సిగాచి పరిశ్రమలో ప్రమాద సమయంలో 143 మంది కార్మికులంటే అందులో సగం మందికిపైగా ఆంధ్రా, ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులే ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు.
చట్టాల సరళీకరణ వల్లే సిగాచి ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES