– రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
– కవి నీలం కుమార్‌కు నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం
నవతెలంగాణ-కల్చరల్
విఖ్యాత కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి భారతీయ సంస్కృతికి ప్రతీక అని, ఆయన విశ్వంభర కావ్యం.. నాగరికత బుద్ధుడి నుంచి గాంధీ వరకు జరిగిన పరిణామ క్రమం తెలుపుతుందని చెప్పారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి 94వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై మంగళవారం సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ నిర్వహణలో సభ నిర్వహించారు. విశ్వంభర పేరిట డాక్టర్ నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని అస్సామీ కవి నీలం కుమార్‌కు గవర్నర్ ప్రదానం చేశారు. రూ.5 లక్షలతోపాటు జ్ఞాపిక ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సాహిత్యం సామాజిక జాతీయ సంస్కృతికి ప్రతిబింబం అన్నారు. కవిత్వం లయ బద్ధమైన హృదయ స్పందనలని చెప్పారు. నారాయణరెడ్డి మానవీయ విలువలతో లయబద్ధమైన కవిత్వం రాశారని వివరించారు. పురస్కారానికి సాంస్కృతిక సంపదకు నెలవైన అస్సాంకు చెందిన కవిని ఎంపిక చేసి ప్రదానం చేయడం జాతీయ సమైక్యతకు నిదర్శనం అన్నారు.అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. కుళ్లిన సంకుచిత ఆలోచనలు, అననుకూల భావనల నుంచి విముక్తి కలిగించేది సాహిత్యం అని చెప్పారు. జీవితంలో ఎదురైన ఘటనల అనుభవాలు తన కవితలకు ప్రేరణ అన్నారు. అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి రామకృష్ణరాజు మాట్లాడుతూ.. సినారే క్రమశిక్షణకు మారు పేరన్నారు. ఆయన పాటలే కాదు మనిషి కూడా ఆకర్షణీయం అని చెప్పారు. తెలుగు జాతికి గర్వకారణం సినారే అని విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి ఆంజనేయరెడ్డి వివరించారు. నారాయణరెడ్డి రచన ‘భలే శిష్యులు’ గ్రంథాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య నివేదిక సమర్పించగా, డాక్టర్ మోహన్ స్వాగతం పలికారు. వేదికపై వరెన్య క్రాంతి తదితరులు పాల్గొన్నారు. తొలుత నారాయణరెడ్డి రచించిన నాగార్జున సాగరం నృత్య రూపకాన్ని యశోద ప్రదర్శించారు.
భారతీయ సంస్కతికి ప్రతీక సినారె..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES