– క్వార్టర్‌ఫైనల్లో 1-2తో పరాజయం
– ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
పారిస్ (ఫ్రాన్స్) : భారత అగ్రశ్రేణి షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ నుంచి నిష్క్రమించింది. ప్రీ క్వార్టర్స్‌లో అసమాన విజయంతో పూర్వ వైభవం గుర్తు చేసిన సింధు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో 14-21, 21-13, 16-21తో పి.వి సింధు ఓటమి చెందింది. వరల్డ్ నం.9 ఇండోనేషియా షట్లర్ పుత్రి కుసుమ వర్దణి తొలి గేమ్‌ను 21-14తో అలవోకగా సాధించింది. కానీ రెండో గేమ్‌లో సింధు దూకుడుగా ఆడింది. 10-3తో దూసుకెళ్లిన సింధు.. కుసుమ వర్దణికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ద్వితీయార్థంలోనూ సింధు దూకుడు ముందు కుసుము నిలువలేదు. 21-13తో సింధు సైతం అలవోకగా రెండో గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రతి పాయింట్ కోసం సింధు, కుసుమ అమీతుమీ పోరాడారు. 11-10తో విరామ సమయానికి ఓ పాయింట్ ముందంజ వేసిన కుసుమ వర్దణి అదే జోరులో ముందంజ వేసింది. వరుసగా నాలుగు పాయింట్లతో 15-11తో ఆధిక్యం సాధించిన కుసుమ వర్దణి వెనక్కి తగ్గలేదు. 15-16తో స్కోరు సమం చేసేందుకు చేరువగా వచ్చిన సింధు.. ఆ తర్వాత ఒత్తిడిలో లయ కోల్పోయింది. 21-16తో కుసుమ వర్దణి మూడో గేమ్‌తో పాటు మహిళల సింగిల్స్ సెమీఫైనల్ బెర్త్‌ను కైవసం చేసుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్ ప్రీ క్వార్టర్స్‌లో అసమాన విజయం సాధించిన ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టో జంట సెమీఫైనల్ ముంగిట నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైన్లలో వరల్డ్ నం.4 మలేషియా జోడీ చెన్, వీలతో మ్యాచ్‌లో 15-21, 13-21తో పరాజయం పాలయ్యారు. 37 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో కపిల, తనీశలు ఆశించిన పోరాట పటిమ చూపించలేదు. పురుషుల డబుల్స్‌లో స్టార్ జోడీ సాత్విక్,చిరాగ్‌లు వరల్డ్ నం.2 మలేషియా షట్లర్లతో తలపడనున్నారు.