Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసింధు శుభారంభం

సింధు శుభారంభం

- Advertisement -

– హెచ్‌.ఎస్‌ ప్రణరు ముందంజ
– బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌

పారిస్‌ (ఫ్రాన్స్‌) : రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు ప్రతిష్టాత్మక బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేసింది. పారిస్‌లో జరుగుతున్న పోటీల్లో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో తెలుగు తేజం అలవోక విజయం సాధించింది. తొలి రౌండ్లో బల్గేరియా షట్లర్‌, వరల్డ్‌ నం.69 కలోయన నల్బంటోవపై 15వ సీడ్‌ పి.వి సింధు 23-21, 21-6తో గెలుపొందింది. 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధుకు తొలి గేమ్‌లో బల్గేరియా అమ్మాయి గట్టి పోటీ ఇచ్చింది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో నిలిచిన బల్గేరియా చిన్నది.. ఆ తర్వాత పట్టు కోల్పోయింది. ద్వితీయార్థంలో పుంజుకున్న సింధు వరుసగా ఏడు పాయింట్లతో మెరిసింది. 12-12 వద్ద స్కోరు సమం చేసి 14-13తో ముందంజ వేసింది. 20-20తో స్కోరు సమం కాగా.. 21-20తో కలొయన మెరిసింది. కానీ 21-21తో స్కోరు సమం చేయటంతో పాటు మరో రెండు వరుస పాయింట్లు సాధించిన సింధు టైబ్రేకర్‌లో పైచేయి సాధించింది. ఇక రెండో గేమ్‌ను సింధు ఆడుతూ పాడుతూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు సైతం రాణించాడు. ఫిన్లాండ్‌ షట్లర్‌ ఓల్డార్ఫ్‌పై 21-18, 21-15తో 47 నిమిషాల తొలి రౌండ్‌ పోరులో గెలుపొంది ముందంజ వేశాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌, రుత్విక శివాని జోడీ 18-21, 21-16, 21-18తో మకావు జోడీపై మూడు గేముల మ్యాచ్‌లో విజయం సాధించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad