-12-0తో చెలరేగిన భారత్
-మహిళల హాకీ ఆసియా కప్
హాంగ్జౌ (చైనా) : మహిళల హాకీ ఆసియా కప్‌లో భారత అమ్మాయిలు చెలరేగారు. గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో సింగపూర్‌ను చిత్తు చేశారు. 60 నిమిషాల ఆటలో 12 గోల్స్‌తో విజృంభించిన అమ్మాయిలు.. గ్రూప్-బిలో అగ్రస్థానం సాధించారు. నాలుగు క్వార్టర్ల ఆటలో మెప్పించిన టీమ్ ఇండియా వరుసగా 4-0, 7-0, 11-0, 12-0తో ఎదురులేని ప్రదర్శన చేసింది. ముంతాజ్ ఖాన్ 2వ నిమిషంలో ఫీల్డ్ గోల్ కొట్టి శుభారంభం చేసింది. 32, 39వ నిమిషంలోనూ గోల్స్‌తో హ్యాట్రిక్ కొట్టింది. నవనీత్ కౌర్ 14, 20, 28వ నిమిషాల్లో గోల్స్ నమోదు చేసింది. నేహా 11, 38వ నిమిషంలో గోల్స్ కొట్టగా.. రుతుజ 53వ నిమిషంలో, షర్మిల దేవి 45వ నిమిషంలో, ఉదిత 29వ నిమిషంలో, లాల్‌రెమిసియామి 13వ నిమిషంలో గోల్స్‌తో దుమ్మురేపారు. గ్రూప్-బి నుంచి భారత్, జపాన్‌లు సూపర్4కు చేరుకున్నాయి. గ్రూప్-ఏ నుంచి సూపర్4 బెర్తులు ఇంకా ఖరారు కాలేదు.