Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసర్‌ లెక్కలతో సిద్ధంగా ఉండండి

సర్‌ లెక్కలతో సిద్ధంగా ఉండండి

- Advertisement -

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీకిి సుప్రీం సూచన
న్యూఢిల్లీ:
బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సరైన వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోరుమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం సూచించింది. విచారణ క్రమంలో ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఓ నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని ఈసీ పేర్కొందని, కానీ వారు సజీవంగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో సందర్భంలో.. బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్టు ప్రకటించారని ఆరోపించారు. అయితే.. ఇటువంటి ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ వాదించారు. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్టు, సజీవంగా ఉన్న వారిని చనిపోయినట్టు ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని.. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే.. వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి ‘సుప్రీం’ ధర్మాసనం సూచించింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు. గతంలో నమోదైన మరణాల సంఖ్య ఎంత? ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య వంటి వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది.

బీహార్‌ ఎస్‌ఐఆర్‌లో సామూహికంగా ఓటర్లను తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటామని జులై29న సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకుముందు జులై10న చేపట్టిన విచారణ సందర్భంగా.. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. అదేవిధంగా ప్రాథమిక పత్రాలుగా ఆధార్‌, రేషన్‌ కార్డుతో పాటు స్వయంగా ఓటర్‌ ఐడీ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా.. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ నెల1న ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చేపట్టక ముందు రాష్ట్రంలో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా, ముసాయిదాలో అది 7.24 కోట్లకు తగ్గింది. సెప్టెంబర్‌ 30న తుది జాబితాను ప్రకటించనున్నారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img