వ్యతిరేకించిన సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను పన్నెండు రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియతో బీహార్‌లో జరిగినట్టుగానే సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన ప్రజలు భారీగా ఓటు హక్కును కోల్పోతారని విమర్శించింది. పౌరసత్వాన్ని నిర్ణయించడంలో ఎన్నికల సంఘం అధికార పరిధిపై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఈసీఐ ఈ ప్రక్రియను కొనసాగిస్తుండటం చాలా ఆందోళనకరమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఓటర్ల నమోదుకు పౌరసత్వం ఒక ముందస్తు అవసరం అయినప్పటికీ, దానిపై నిర్ణయం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది.
‘బీహార్ అనుభవం నుంచి నేర్చుకోవడానికి ఎన్నికల సంఘం నిరాకరిస్తుంది. నమోదు ఫారమ్‌లతో పాటు రుజువుగా అవసరమైన పదకొండు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ అంగీకరించవలసి వచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత మాత్రమే ఆధార్ కూడా నివాస రుజువుగా మాత్రమే పరిగణించబడింది. పేదలు, బలహీన వర్గాల వద్ద సాధారణంగా లేని పత్రాలపై పట్టుదల వీరి ఓటు హక్కును అసమానంగా కోల్పోతుంది’ అని పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో తెలిపింది. ఓటర్ల నమోదు భారాన్ని ఓటర్లపైనే మోపడాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తున్నట్టు పొలిట్ బ్యూరో పునరుద్ఘాటించింది. ఓటర్ల నమోదు బాధ్యత ఈసీదేనని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. అలాగే, ఓటర్ల జాబితా తప్పులు లేకుండా, సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సీపీఐ(ఎం) ధృఢంగా విశ్వసిస్తుందని, కానీ బీజేపీ విభజన హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి పౌరసత్వాన్ని నిర్ణయించడానికి ఈసీని ఒక సాధనంగా ఉపయోగించలేమని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.



