– ఈసీ లోతుగా పరిశీలించాల్సిన అవసరముందన్న సుప్రీం
– బుధవారానికల్లా ఈసీకి అభ్యర్ధన పంపాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను డిసెంబరు 13 తర్వాత కనీసం ఒక వారం రోజుల పాటు పొడిగించాలని కేరళ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు చేస్తున్న అభ్యర్ధనలు సరైనవేనని, వాటిల్లో న్యాయం వుందని సుప్రీం కోర్టు మంగళవారం పేర్కొంది. భారత ఎన్నికల కమిషన్ వాటిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈసీకి అభ్యర్ధన పంపని పక్షంలో పొడిగింపునకు గల కారణాలను వివరిస్తూ ఒక లేఖను పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. బుధవారానికల్లా ఈసీకి ఈ అభ్యర్ధన అందేలా చూడాలని పేర్కొంది. రాష్ట్రం చేసిన అభ్యర్ధనలను సానుభూతితో, నిష్పాక్షితతో రాబోయే రెండు రోజుల్లో పరిశీలించాల్సిందిగా ఇసిని కోర్టు కోరింది. కింది స్థాయి ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించుకునేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు చేసిన అభ్యర్ధనలను కూడా బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. 941 గ్రామ పంచాయితీలు, 152 బ్లాక్ పంచాయితీలు, 14 జిల్లా పంచాయితీలు, 87 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లతో కూడిన 1200 స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికలకు కేరళ సమాయత్తం అవుతోంది. మొత్తంగా 23,612 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
పని ఒత్తిడి భరించలేక ఇటీవల బూత్ లెవల్ అధికారులు కొంతమంది మరణిస్తుండగా, మరికొంత మంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గణన దశ గడువును డిసెంబరు 4 నుంచి11కి పొడిగించింది.
ఈ నేపథ్యంలో సర్ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీలు, తమిళనాడు పాలక పార్టీ, పశ్చిమ బెంగాల్ నేతలు ఇలా అందరూ వేర్వేరుగా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
కాకపోతే కేరళ సమస్య ఇక్కడ తక్షణమే పొంచి వుంది. ఒకపక్క సర్, మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు రెండూ ఒకేసారి జరగడం వల్ల పాలనాపరమైన ప్రతిష్టంభన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తోందని కేరళ సర్కార్ పేర్కొంటోంది. రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలు సాగించడానికి సిబ్బంది ఎవరూఅక్కడ వుండని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో సర్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాల్సిందిగా ఈసీని కోరేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని రాష్ట్రం కోరింది.
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ డిసెంబరు 9, 11 తేదీలు.ఓట్ల లెక్కింపు 13వ తేదీ, ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి చివరి తేదీ డిసెంబరు 18 అని కేరళ తరపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సి.కె.శశి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల నిమిత్తం ప్రభుత్వ, క్వాసి ప్రభుత్వ సర్వీసులకు చెందిన 1,76,000మంది సిబ్బందిని మోహరించాల్సి వుంది. పైన మరో 68వేల మంది పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది కావాల్సి వుంటుంది. మరొకవైపు ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు శిక్షణ పొందిన సిబ్బంది పెద్ద సంఖ్యలో 22,668మంది అవసరపడతారని పేర్కొంది.
కేరళలో ఎన్యూమరేషన్ దశ సాఫీగా సాగిపోయిందని, ఓటర్లకు 98.8శాతం ఫారాలు అందచేశారని, 84శాతానికి పైగా ఫారాలు మళ్లీ వెనక్కి కూడా అందాయని, వాటిని డిజిటలైజ్ చేయడం జరిగిందని ఈసీ తరపున సీనియర్ న్యాయవాదులు రాకేష్ ద్వివేది, మణిందర్ సింగ్‌లు తెలిపారు. ఎస్‌ఐఆర్, స్థానిక ఎన్నికలకు అడ్డం కావని వారు వాదించారు. దీనిపై కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది రమేష్ బాబు మాట్లాడుతూ, సర్‌కు కేటాయించిన సిబ్బందినే స్థానిక సంస్థల ఎన్నికల అధికారులుగా నియమించి రెండు పనులు చేయాలని ఒత్తిడి తీసుకురాలేమని అన్నారు. రాష్ట్రంలో సర్ పనుల కోసం సిబ్బంది కొరత లేదని, మరింతమంది సిబ్బంది అవసరం లేదని చెప్పారు.
సర్ గణన పొడిగించాలన్న కేరళ వాదన న్యాయమైనదే !
- Advertisement -
- Advertisement -



