రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల స్వారీనుంచి రాష్ట్రపతి స్థానాన్ని తక్కువ చేయడం వరకూ రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, వీటిపై అత్యున్నత న్యాయస్థానంలోనే ఆలస్యాలు, అరకొర సాంకేతిక సమర్థనలూ మోడీ ప్రభుత్వ హయాంలో పరిపాటిగా మారాయి. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ వివాదాస్పద పరిణామాలు సంభవిస్తున్నాయి. వీటిలో మరింత ఆందోళనకరమైందీ, ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఓటుకే చేటు తెచ్చేది సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) తతంగం. దీనిపై ప్రతిపక్షాల విమర్శలు తప్ప బడా మీడియాలో ఎలాంటి తీవ్ర చర్చ జరక్కపోవడం ఆశ్యర్యమే గానీ అనూహ్యం కాదు. గత నెలలో ముగిసిన పార్లమెంటు సమావేశాలలోనూ సర్‌ను చర్చకు పెట్టడానికి తీవ్ర పోరాటం అవసరమైంది. ఆ చర్చలో పాల్గొంటూ హోంమంత్రి అమిత్ షా ఈ దేశ ప్రధాని, ముఖ్యమంత్రి వంటి కీలక పదవులకు విదేశీయుల ఓట్లతో ఎన్నికయ్యే అవకాశం కల్పించబోమని తీవ్ర హెచ్చరికలే చేశారు.
2024లో జరిగిన ఎన్నికల వరకూ దేశంలో అసలు సర్ అనే మాట లేదు. రాజ్యాంగం 324వ అధికరణం ఎన్నికల కమిషన్ నియామకం గురించి చెబుతుంటే 326 మధ్యలో ఓటర్ల జాబితాల సవరణ పరిశీలన గురించి చెబుతుంది. దాన్ని స్పెషల్ రివిజన్ , సమ్మరీ రివిజన్( ప్రత్యేక పరిశీలన, హఠాత్ పరిశీలన) అనే పేర్లతోనే పిలిచేవారు.2024 ఎన్నికల తర్వాత 2025 జూన్‌లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరగవలసి వుండగా నెలరోజుల ముందు ఎన్నికల సంఘం హఠాత్తుగా ఈ సర్ ప్రక్రియను ప్రకటించింది. అది కూడా నెలరోజుల లోపల పూర్తి కావాలని ఆదేశించింది. ఆరున్నర కోట్లమంది ఓటర్లను అంత తక్కువ వ్యవధిలో పరిశీలించడం సాధ్యం కాదని చెప్పినా పెడచెవిన పెట్టింది.
ఓటరు నమోదు కోసం పదకొండు పత్రాలలో ఏదైనా ఒకటి చూపించాలని చెప్పింది. చివరకు దాదాపు 69.5 లక్షల ఓట్లను తొలగించి శాసనసభ ఎన్నికలు జరిపింది. ఒక్క ఓటును కూడా చేర్చింది లేదు. అందుకే దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రిమువల్(తొలగింపు) అనడమే సరైంది. బీహార్‌లో పోలింగ్ జరిగినప్పుడు తమ పేరు లేదంటూ అనేక చోట్ల ఓటర్లు ఆందోళన చేశారు. ఫలితం లేదు. ఆ వెంటనే మరో పన్నెండు రాష్ట్రాలలో సర్ చేపట్టారు. వీటిలో పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు వంటివి ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు మాత్రమే గాక బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నాయి. యూపీ, గుజరాత్, గోవా వంటివి కూడా వున్నాయి. వీటన్నిటిలోనూ కోట్ల ఓట్లు తొలగించ బడ్డాయి. తమిళనాడులోనే 97 లక్షల ఓట్లు, యూపీలో 2.95 కోట్ల ఓట్లు తీసివేయడం కొన్నిదేశాల జనాభా కంటే ఎక్కువగా వుంది.
అంతా రహస్యమే
గతంలో ఓటరుగా చేరండంటూ ప్రచారోద్యమాలు నడిచేవి. ఓటరు ఐడినే గాక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా, ఐడెంటిటి కార్డు వంటివి నాలుగైదు పత్రాలలో ఏది తెచ్చినా చాలని ముందే ప్రకటించేవారు. పేరు కనిపించకపోతే ఛాలెంజ్ ఓటువేసే అవకాశం కూడా వుండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎవరిని తొలగించారో జాబితా ఇవ్వడానికి కూడా ఎన్నికల సంఘం నిరాకరిస్తే సుప్రీంకోర్టు వెంటాపడాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఓటరు వారి బూత్‌లో చూసుకోవలసిందే గానీ తగిన వ్యవధితో సమగ్ర జాబితా లేకుండా పోయింది.ఈసి ఏర్పాటు పూర్తిగా ప్రధానమంత్రి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎన్నికల కమిషనర్లు పొరబాటు చేసినా చర్య తీసుకో కుండా ముందస్తు రక్షణ(ఇమ్యూనిటీ) కల్పిస్తూ చట్టం చేయబడింది.
దేశానికి గర్వకారణమైన నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు కూడా విదేశీయుడు కాదని నిరూపించుకోవలసిందిగా నోటీసు ఇచ్చారు.(సోనియా గాంధీ పౌరసత్వం పొందకుండానే ఓటరుగా నమోదైనారనే దానిపై ఢిల్లీ హైకోర్లు ముందే విచారణ జరుపుతున్నది.) దక్షిణ గోవా కాంగ్రెస్ ఎంపీ వీరియోటో ఫెర్నాండెజ్‌కు అధికార పత్రాలతో తన పౌరసత్వం నిరూపించుకోవలసిందిగా ఎన్నికల సంఘం నోటీసు లిచ్చింది. ఆయన గతంలో 28 ఏళ్లపాటు నౌకాదళాధికారిగా పనిచేశారు. వీరందరూ చొరబాటుదారులు గనక ప్రత్యేకంగా నోటీసులు జారీ చేయవలసి వచ్చిందా? సర్ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ‘ఈ పత్రాలు ఇప్పటికిప్పుడు మేమే చూపించలేము మామూలు మనుషులు ఎక్కడ చూపించగలరని’ ప్రశ్నించారు. 2003 ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకుని 2025-26లో పోల్చిచూస్తే ఇలాంటి తేడాలు రాకుండా ఎలా వుంటాయి? అందులోనూ 39శాతం మంది వలసలు పోయే బీహార్ వంటి చోట్ల ఇళ్ల సర్వేలో కనిపించలేదు గనక కోట్లమందిని తీసేయడమేంటి?
2003 దేనికి? పౌరసత్వం సవాలేంటి?
ఈ గందరగోళం కావాలని సృష్టించిందే. ఎప్పుడైనా రెన్యూవల్ లేదా వెరిఫికేషన్ అంటే వున్న పత్రాన్ని లేదా ఆధారాన్ని చూస్తారు. 2025లో వెరిఫికేషన్ అంటే అంతకుముందు ఎన్నికలు జరిగిన నాటి జాబితాలు చూడాలి.2019, 2014 ఎన్నికలకు ఉపయోగించిన జాబితాలు ఎందుకు అక్కరకు రాకుండా పోయాయి? అలాగే రాష్ట్రాలలోనూ అంతకుముందు ఎన్నికల తేదీలను చూడాలి. కానీ 2003ను కొలబద్దగా ఎందుకు తీసుకున్నట్టు? గుజరాత్‌లో మారణకాండ అనంతరం ఎన్నికలు జరిపించి మోడీ రెండవసారి ముఖ్యమంత్రి కావడం,వెంటనే 2004 ఎన్నికలలో వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోవడం అప్పుడే జరిగాయి. దానికీ ఈ ఎంపికకూ ఏమైనా సంబంధం వుందేమో ఈసికే తెలియాలి. కానీ, మొత్తం సర్ పారదర్శకత లేని నిగూఢ వ్యవహారంగా తయారైంది. ప్రస్తుత దఫా ముగిసిన తర్వాతనే సర్ ప్రక్రియ రాజ్యాంగ బద్దత తేలుస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రకటించడాన్ని బట్టి చూస్తే జరగబోయే శాసనసభ ఎన్నికలకు ఇదే కొనసాగడం తథ్యం. ఒక్క బీజేపీ తప్ప ఏ జాతీయ పార్టీ గానీ, చాలా ప్రాంతీయ పార్టీలు గానీ సర్‌ను బలపర్చడం లేదు. టీడీపీ, జనసేన, వైసీపీ, బీఆర్‌ఎస్ వంటివి మాత్రం వ్యతిరేక పోరాటం చేయడం లేదు.
రాజ్యాంగం రెండవ భాగంలో పౌరసత్వం సంబంధించిన నిబంధన లున్నాయి. 324వ అధికరణంలో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఎన్నికల సంఘం అధికారాలు వున్నాయి. ఈ రెండుచోట్ల చూస్తే ఎక్కడా ఈసి పౌరసత్వం ఇస్తుందని కానీ, నిర్ధారిస్తుందని కానీ లేదు. ఒక దశలో అంటే రాష్ట్రాల వాదన వినేప్పుడు సుప్రీం కోర్టు ధర్మాసనం కూడా ‘పౌరసత్వం మీ బాధ్యత కాదు కదా’ అని ఈసిని ప్రశ్నించింది. అదే సమయంలో మరోవైపు నుంచి దేశ పౌరులు కాని వారికి ఓటు హక్కు వుండకూడదు కదా అని మరో ప్రశ్న వేసింది. తన వంతు వాదనలు మొదలు పెట్టిన ఈసి తరపు న్యాయవాది నేరుగా పౌరసత్వం నిర్ధారించుకునే హక్కు మాత్రమే గాక బాధ్యత కూడా ఈసికి వుందని ప్రకటించారు. సాధారణంగా దేశంలో నివసించే వారు ఓటు హక్కుకు అర్హులని రాజ్యాంగం చెబుతుందే గానీ పౌరసత్వం కొలబద్దగా చెప్పలేదు. ఏ వ్యక్తినీ కుల, మత, జాతి తదితర తేడాల కారణంగా ఓటు హక్కు నిరాకరించరాదని 325వ అధికరణం స్పష్టం చేస్తున్నది. ఓటింగు సార్వత్రిక ఓటు హక్కు ప్రాతిపదికనే ఎన్నికలు జరగాలని 326వ అధికరణం చెబుతున్నది. అనేక ఇతర అంశాలు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అమలవుతుంటాయి.
మతతత్వ పాచిక ముసుగు
ఇక్కడ కేంద్రం, దాంతోని చేతులు కలిపిన ఈసి సాగించే తిరకాసు దాగివుంది. 2019లో మోడీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) ఆమోదించింది. దీని ప్రకారం ఇరుగుపొరుగు దేశాలనుంచి వచ్చిన ముస్లింలు, క్రైస్తవులు తప్ప ఇతరులకు పౌరసత్వం లభిస్తుంది. ఇది ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల ఎన్నిలకు ఫలితాలను ప్రభావితం చేసే బీజేపీ హిందూత్వ రాజకీయంగా అందరూ గుర్తించారు. 2024 నుంచి దాన్ని అమలులోకి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే జనాభా లెక్కలు జరపలేదు గనక దేశపౌరుల రిజిస్టరు (ఎన్‌ఆర్‌సి) అనేది ఇంకా ప్రారంభం కాలేదు. ఆ లెక్కలు వాయిదా వేస్తూనే చొరబాటుదారుల ముద్రతో కోట్లమందికి ఓటు లేకుండా చేయడానికి సర్ ఒక ఆయుధంగా రూపొందింది. సర్‌ను తాముగా మొదలు పెట్టలేదని ఎన్నికల సంఘం అధికారికంగా తెలియజేసింది. ఎవరి ఆదేశాలతో చేస్తున్నారంటే సూటిగానే సమాధానం నిరాకరించింది.
మరోవైపున ఈ ప్రక్రియ నిర్వహించడానికి నియమితులైన బూత్ లెవల్ అధికారులు(బిఎల్‌వో)లు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఆ ఒత్తిడి ఏ స్థాయిలో వుందో సందేహం కలుగుతుంది. పౌరసత్వ సమస్య 1980లలో మొదలైంది అస్సాంలో మాత్రం సర్ అమలు చేయడం లేదు. దానికి ఏవో సాంకేతిక సాకులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ పరిణామాలను మతకోణంలోనే చూపిస్తూ బెంగాల్, అస్సాంలలో వారిని చొరబడనివ్వబోమని రోజూ హెచ్చరికలు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో 2.89 కోట్లు,18.7శాతం ఓట్లు తొలగించారు. రాష్ట్రంలోని 75 జిల్లాలలో 22 జిల్లాలలోనైతే అంతకంటే ఎక్కువగా 25శాతం పైనే తీసేశారు. లక్నోలో 30శాతం, గజియాబాద్‌లో 28.8శాతం, కాన్పూర్‌లో 25.5శాతం ఓట్లు తొలగించారంటే సర్ లోతుపాతులేంటో తెలుస్తుంది. ఒక క్రమపద్ధతిలో కొన్ని వర్గాల ఓట్లు సామూహికంగా తొలగించడం, తమకు రాజకీయంగా అనుకూలత లేనిచోట్ల తారుమారు చేయడం జరుగుతుందన్నమాట. డీ డూప్లికేషన్ సాఫ్టవేర్ చెప్పిన ప్రకారం పరిశీలించామంటూనే ప్రత్యక్ష పరిశీలన మొదలుపెడతారు. ఆ జాబితా ఇమ్మంటే లేదంటారు. మరోచోట ఆ సాఫ్ట్‌వేర్ లేదని బుకాయిస్తారు.
అందుకే సర్ ఒక బూటకంగా మారిందని హిందూ పత్రిక సంపాదకీయమే రాసింది. తమకు అవసరమైన మహారాష్ట్రలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఏకంగా 39 లక్షల ఓట్లు జోడించబడ్డాయి! ఈవిఎంలు, పోలింగ్ శాతం తేడాలు, డేటా వేగంగా డెలిట్ చేయడం, వివిపాట్‌లను అనుమతించడం, ఈవిఎంలో దానిస్థానం వంటివాటిపై అనేక ఫిర్యాదులు వున్నాయి. కొన్ని ప్రాంతాలపై కేంద్రీకరించడంవల్ల అనుకున్న ఫలితాలు తెచ్చుకోవడానికి వీలవుతున్నదని నిపుణుల అభిప్రాయం. కార్పొరేట్ ధనబలం, మత రాజకీయం తోడు అసలు ఓటుహక్కు ఎన్నికల వ్యవస్థ కూడా తలకిందులైతే దేశానికి రక్షణ వుండదు. ప్రపంచీకరణ తర్వాత ఎన్నికల వ్యవస్థల విశ్వసనీయత పోతున్నట్టు దేశాల అనుభవాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ నివేదికలలో భారత ఎన్నికల ప్రక్రియపైనా విమర్శలు కావలసినన్ని కనిపిస్తున్నాయి. గాలింపు, తొలగింపు, తరలింపు (డిటెక్ట్,డెలిట్,డిపోర్ట్) అనేది నినాదమైతే సమ్మిళిత ప్రజాస్వామ్యం ఎలా బతికి బట్టకడుతుందా? ఓటింగులో అధికంగా పాల్గొనే అణగారిన వర్గాలు, మహిళలు, మైనార్టీలే ఈ తతంగంలో అత్యధికంగా బలికావడం మరింత దారుణం.
తెలకపల్లి రవి



