పేరుకు మనది అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇప్పుడది మేడిపండు చందంగా మారిపోయిందనడానికి బీహర్‌లో ఓటర్లు జాబితా సవరణ(సర్) తాజా ఉదాహరణ. దానిపై విపక్షాలు లేవనెత్తిన మౌళిక ప్రశ్నలు అలాగే ఉన్నాయి. సమాధానం చెప్పాల్సిన ఎన్నికల సంఘం ఎదురుదాడికి తెగబడిందే తప్ప. స్పష్టత ఇవ్వడానికి సిద్ధపడలేదు. పైగా అదే ‘సర్’ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రేపు(బుధవారం) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో (సీఈఓ) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికలను నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం ఒంటెత్తు పోకడ పోతుందనడానికి ఇది మరో ఉదాహరణ.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ బృహత్కర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని ఈసీ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఈసీ అధికారిక ప్రకటన చేయనప్పటికీ… ఎన్నికల సంఘం వర్గాల కథనాలు మాత్రం ఇదే విషయం ధ్రువీకరిస్తున్నాయి. ఈ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది. దాని ప్రకారం సీఈఓలు తమ తమ ప్రాంతాల్లోని ఓటర్ల సంఖ్య, చివరిసారిగా ‘సర్’ ఎప్పుడు నిర్వహించారు అనే వివరాలతో పాటు మొత్తం పది కీలక అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌తో సిద్ధంగా రావాలని ఈసీ ఆదేశించిందంటే… ఓటర్ల జాబితా సవరణ అంశానికే ఈసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రజాస్వామ్యానికి కాపు కాయవలసిన స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ అధికార పక్ష ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందనే విమర్శలు ఈసీపై వెల్లువెత్తుతున్నాయి. నాటి టి.ఎన్. శేషన్ వలె పులిలా గాండ్రించగల అధికారం రాజ్యాంగ వ్యవస్థలకు ఉన్నప్పటికీ పాలకుల పెంపుడు చిలకలుగా మారిపోయి, పంజరాల్లోకి చేరిపోయాయి. సర్కారు వారి పాటకు అవి కోరస్‌లు పాడుతుంటే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టా? మాయల ఫకీర్ల చెరలో మూలుగుతున్నట్టా? ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం ఇది.
కుల, మత, జాతి నెపాలతో ఏ వ్యక్తికీ ఓటు హక్కును తృణీకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని 325వ అధికరణం స్పష్టం చేసింది. కానీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందట బీహార్ ప్రజలు ‘పౌరసత్వ శీల’ పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాటమాత్రంగానైనా చెప్పకుండానే, ఆ తర్వాత ఓటర్ల జాబితాల ప్రత్యేక వడబోత (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇప్పుడదే ‘పౌరసత్వ శీల’ పరీక్షను దేశ ప్రజలందరూ ఎదుర్కోవలసిందే అని ఈసీ చేష్టల ద్వారా విధితమవుతోంది.
ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఎన్నికల సంఘం కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. గత జాబితాలో ఉన్న 65 లక్షల మందిని తొలగించినట్టు ప్రకటించింది. ఇందులో 22 లక్షలు చనిపోయిన వారి పేర్లనీ, 36 లక్షలమంది శాశ్వతంగా వలస పోయారనీ పేర్కొన్నారు. శాశ్వతంగా వలస పోయినట్టు ఎలా నిర్ధారణకొచ్చారో తెలియదు. 22 లక్షలమంది ఏయే సమయాల్లో చనిపోయారో తెలియదు. దేశంలో కోట్లాది మంది దినసరి ఉపాధి కోసం పలు ప్రాంతాలకు తాత్కాలికంగా వలస పోతారనే సంగతి జగమెరిగిన సత్యం. వాళ్లంతా హుటాహుటిన సొంతూరికి బయల్దేరి తమ ముల్కీని నిరూపించుకోవాలంటే అయ్యే పనేనా? వీటిని ఆగమేఘాలపై అమలు చేసి విమర్శల పాలయింది. అయినా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు సరి కదా.. మరింత దూకుడుగా వ్యవహరిస్తూ సర్కార్ బాకాను బజాయిస్తోంది.
ఎన్నికల నిర్వహణతోపాటు, ఓటర్ల జాబితా రూపకల్పన బాధ్యతను 324వ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘంపైనే రాజ్యాంగం మోపింది. ఓటరుగా నమోదయ్యే బాధ్యతను పౌరునిపై రాజ్యాంగం పెట్టలేదు. ఓటును అతనికి ఒక హక్కుగా ప్రసాదించింది. ఇప్పుడు ఆ హక్కే ఉనికిలో లేకుండా పోతుంది. పౌరులను ఓటరుగా నమోదు చేయవలసిన బాధ్యతను నిర్వహించవలసిన ఎన్నికల సంఘం అందుకు విఘ్నాలను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమవుతుంది. గతంలో ఎన్నికల సంఘమే జారీచేసిన ఓటరు కార్డులు చెల్లువు అనడం ఆందోళనకరం. ఈ గుర్తింపు కార్డుల ఆధారంగా ఇప్పటివరకు జరిగినవన్నీ బూటకపు ఎన్నికలే అనుకోవాలా?
భారతదేశంలో ప్రతి వెయ్యి జనాభాకు జననాల రేటు 19.3 శాతంగా ఉంటే మరణాల రేటు 7.5 శాతంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వ హెల్త్ ప్రొఫైల్ నివేదిక తెలియజేస్తున్నది. ఈ లెక్కన ఐదేండ్లలో ఓటర్లు పెరగాలి. కానీ తగ్గడం ఆశ్చర్యాన్నీ, ఆందోళననూ కలిగిస్తున్నది. ఎన్నికల సంఘం అంపశయ్యపైకి చేరిందనీ, మన ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొస్తున్నదనీ అనడానికి ఈ పరిణామాలే నిదర్శనాలు. రాజకీయ వ్యవస్థలతోపాటు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజాలు గొంతెత్తి ప్రతిఘటించకపోతే మనం భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.
‘సర్’వ శిక్ష!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES