అప్పుల ఊబిలోకి నెడుతున్న ‘సైలెంట్ డెట్’
యువ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు
వాయిదా చెల్లింపుల ఉచ్చులో పడొద్దు
స్వీయ నియంత్రణ అవసరం : హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలోని యువ ఉద్యోగుల జీవితంలో ఈఎంఐలు ఒక సాధారణ భాగంగా మారిపోయాయి. కొత్త స్మార్ట్‌ఫోన్, వీకెండ్ ట్రిప్, ఫ్యాషన్ గాడ్జెట్.. ఇలా చిన్న చిన్న కోరికలతో ప్రారంభమైన ఖర్చులు మొదట్లో తేలికగానే కనిపిస్తాయి. కానీ అవే క్రమంగా పెరిగి గుర్తించని స్థాయిలో భారీ అప్పులుగా మారుతు న్నాయి. ఈ పరిస్థితినే ఆర్థిక నిపుణులు ‘సైలెంట్ డెట్’ అని పిలుస్తున్నారు. అయితే ఈ వాయిదా చెల్లింపులతో దారి తీసే సైలెంట్ డెట్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యంగా వహిస్తే అప్పులతో తిప్పలు పడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
సైలెంట్ డెట్ అంటే..?
సైలెంట్ డెట్ అనేది ఒక్కసారిగా కనిపించని అప్పు. ఇది చిన్న రుణాల రూపంలో ప్రారంభమై, క్రమంగా పెరుగుతుంది. క్రెడిట్‌కార్డ్ ఈఎంఐలు, వ్యక్తిగత రుణాలు, ‘బై నౌ పే లేటర్’ (ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి -బీఎన్‌పీఎల్) స్కీమ్స్.. ఇలా ఇవన్నీ కలిపి ఒక వ్యక్తికి ఎంత మొత్తం అప్పు ఉందో కూడా ఆ వ్యక్తికే స్పష్టంగా తెలియక పోవచ్చు. అయితే ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ రుణాలు ఒక్కటే కాకుండా.. వివిధ యాప్‌లు, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి కూడా యువ ఉద్యోగులు లోన్స్ తీసుకుంటారు. ఫలితంగా సదరు వ్యక్తికి అప్పు ఎంత ఉందో గుర్తించడం కష్టమవుతుందని వివరిస్తున్నారు.
లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్
యువ ఉద్యోగులు తమ ఆదాయం పెరిగినా కొద్దీ తమ జీవనశైలిని కూడా మరింత ‘ప్రియం’గా మార్చుకుంటున్నారు. ప్రతి ఏడాది కొత్త ఫోన్ కొనడం, కుటుంబసభ్యులు, స్నేహితులతో తరచూ ట్రిప్‌లకు వెళ్లడం, ఖరీదైన రెస్టారెంట్లలో ఖర్చు చేయడం.. ఇవి యువ ఉద్యోగుల జీవన వ్వయాన్ని పెంచుతున్నాయి. దీనినే ‘లైఫ్‌స్టైల్ ద్రవ్యోల్బణం’లో భాగమని విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి తోడు యువ ఉద్యోగులపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. బహుళజాతి కంపెనీలు ప్రభావశీల వ్యక్తులను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని, వారి ద్వారా చూపించే లగ్జరీ జీవనశైలిని చూసి ‘నేనూ అదే స్థాయిలో ఉండాలి’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ – ఫోమో) అనే భావన వారిలో పెరుగుతోంది. ఇది వారి జీవితాల్లో అవసరం లేని ఖర్చులను ప్రోత్సహిస్తూ అప్పుల దారికి బాటలు వేస్తోంది.
ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలి?
సైలెంట్ డెట్ నుంచి బయట పడటం అసాధ్య మేమీ కాదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే అందుకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని సూచిస్తున్నారు. అన్ని రుణాలనూ ఒకే లోన్‌లో కలిపి (లోన్ కన్సాలిడేషన్) చెల్లించడం, ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను ముందుగా క్లియర్ చేయడం, ఈఎంఐలను మొత్తం ఆదాయంలో 35-40 శాతంలోపే ఉంచడం, ఖర్చులను నియంత్రణ చేయడం, బడ్జెట్ పాటించడం, పొదుపులు, అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్)ను నిర్మించడం.. ఇవి పాటిస్తే క్రమంగా ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చని వారు చెప్తున్నారు.
యువత ఎందుకు ఈ ఉచ్చులో పడుతోంది?
ప్రస్తుత కాలంలో డిజిటల్ ఫైనాన్స్ సర్వీసులు చాలా సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఒక్క క్లిక్‌తోనే ఈఎంఐలు, చిన్న రుణాలు తీసుకోవచ్చు. ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి’ అనే కాన్సెప్ట్ యువతను చాలా ఆకర్షిస్తోంది. అదే సమయంలో వారి ఆదాయం పెరుగుతున్నా.. అది చాలా పరిమితంగా ఉంటోంది. వారి ఆదాయ పెరుగుదల సుమారు 7 నుంచి 11 శాతంగా మాత్రమే నమోదవుతోంది. కానీ క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు 36-48 శాతం వరకు ఉంటాయి. అంటే వారు సంపాదించే దాని కంటే అప్పు ఖర్చు వేగంగా పెరుగుతోందన్న మాట.
ప్రమాద సంకేతాలు ఎప్పుడు కనిపిస్తాయి?
సైలెంట్ డెట్ ప్రమాదకరస్థాయికి చేరినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈఎంఐలు ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువడం, పాత అప్పులు తీర్చడానికి కొత్త రుణాలు తీసుకోవడం, ఈఎంఐలు సమయానికి చెల్లించకపోవడం, పొదుపులు లేకపోవడం, నెల జీతంతోనే జీవించడం వంటివి కనిపిస్తే ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో ఉన్నట్టు అర్థమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రణాళిక లేకపోవడమే అసలు సమస్య
చిన్న ఈఎంఐలు సమస్యలు కావనీ, అయితే వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించలేకపోవడమే అసలు సమస్యగా ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. అలా చేయలేకపోతే ఈఎంఐలు క్రమంగా పెరిగి పెద్ద ఆర్థిక భారంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. యువ ఉద్యోగులు తమ ఖర్చులపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. బహుళజాతి కంపెనీల వాయిదా చెల్లింపుల ఆకర్షణీయమైన ప్రలోభాలకు లొంగకుండా స్వీయ నియంత్రణ పాటించాలని చెప్తున్నారు. లేదంటే.. కనిపించని ఈ సైలెంట్ డెట్ భవిష్యత్తులో ఒక పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదముందని అంటున్నారు. అది ఆ వ్యక్తి మీదనే కాకుండా.. వారి మీద ఆధారపడి ఉంటే కుటుంబం పైనా ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.



