Saturday, November 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసోషలిజమే దిక్సూచి

సోషలిజమే దిక్సూచి

- Advertisement -

అక్టోబర్‌ విప్లవంతో వినూత్న మార్పు
ప్రపంచ చరిత్రను కొత్త దిశలో నడిపింది
దోపిడీ, పీడన లేని సమాజం సాధ్యమేనని చూపెట్టింది
జార్‌ చక్రవర్తిపై విజయం సాధించిన పోరాటమది
నెరవేరిన శాంతి, అందరికీ భూమి, ఆహారం హామీలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
సోషలిస్టు వ్యవస్థ వైపు అమెరికా ప్రజల మొగ్గు
అభివృద్ధిలో దూసుకుపోతున్న చైనా సోషలిస్టు వ్యవస్థ
అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తితో బీజేపీ విధానాలపై పోరాటాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శాంతి, అందరికీ భూమి, ఆహారం హామీలను నెరవేర్చిన సోవియట్‌ యూనియన్‌ అక్టోబర్‌ విప్లవం సమాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చిందనీ, ప్రపంచ చరిత్రను కొత్త దిశలో నడిపిందనీ, దోపిడీ, పీడన లేని సమాజం సాధ్యమేనని చూపెట్టిన మహౌత్తర పోరాటం అది అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభ్రదం అన్నారు. అక్టోబర్‌ విప్లవ దినోత్సవాన్ని నవంబర్‌ ఏడో తేదీన జరుపుకోవడానికి గ్రిగేరియన్‌ క్యాలెండర్‌ కారణమన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం (ఎంబీ.భవన్‌)లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి. జ్యోతి అధ్యక్షతన అక్టోబర్‌ విప్లవం-విశిష్టత అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. లెనిన్‌ నేతత్వంలోని బోల్షివిక్‌ పార్టీ, బూర్జువాలు కలిసి రష్యాలో జార్‌ చక్రవర్తుల పాలనను కూలదోసి ఫిబ్రవరి 17న ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

అయితే, ప్రజలు ఆశించిన విధంగా యుద్ధాల నుంచి విముక్తి, రైతులకు భూమి, అందరికీ రేషన్‌ అందించేందుకు బూర్జువాలు సిద్ధంగా లేకపోవడంతో ప్రజల సహకారంతో అక్టోబర్‌ విప్లవం ద్వారా లెనిన్‌ నాయకత్వంలో రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. ఆ ప్రభుత్వం యుద్ధాల నుంచి శాంతి కలిగించి పేదలకు భూములను పంచిందనీ, అందరికీ రేషన్‌, సంక్షేమం అందించిందని వివరించారు. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలివ్వ టం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడంతో లెనిన్‌ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెరిగిందన్నారు. ఓవైపు రష్యాలో జాతుల మధ్య ఐక్యత కోసం సిద్ధాంతాన్ని రూపొందించడంతోనే ఆ తర్వాత కాలంలో సోవియట్‌ రష్యా ఏర్పడిందన్నారు. అదే సమయంలో జర్మనీతో వ్యూహాత్మక సంధి చేసుకుందని తెలిపారు. 70 ఏండ్లపాటు రష్యా సోషలిస్టు ప్రభుత్వం ప్రపంచానికి ప్రత్యామ్నాయ పాలన అందించిందన్నారు.

ఆ 70 ఏండ్లలో అనేక దేశాల నేతలు సోషలిస్టు భావజాలం వైపు మొగ్గు చూపారని తెలిపారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన పాలకులు తీసుకున్న విధానాలతో 1989-90 సోషలిస్టు వ్యవస్థ కూలిపోయిందన్నారు. దీంతో కమ్యూనిస్టుల పని అయిపోయిందనీ, పెట్టుబడి దారీ వ్యవస్థలోనూ ప్రజల సంక్షేమం ఉందని ప్రచారాన్ని కొన్న శక్తలు చేపట్టాయన్నారు. సిద్ధాంతాన్ని అమలు చేయడంలో నాయకుల నిర్ణయాలు సరిగా లేకపోవచ్చుగానీ, ఎప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతం అత్యున్నతమైనదని ఆనాడే సీపీఐ(ఎం) సగర్వంగా చెప్పిందన్నారు. ఒకదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడం, సోషలిస్టు వ్యవస్థ నిర్మించడం వేరు వేరు అంశాలన్నారు. ఉత్పత్తి విధానంలో మార్పు, ఆర్థిక విధానాలు, ఉద్యోగాల కల్పన, మహిళలకు సమాన అవకాశాలు వంటి అంశాల్లో మార్పులు రాకుండా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన సోషలిస్టు వ్యవస్థగా మారిందని చెప్పలేమన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలనీ, సంపద సష్టించాలనీ, పోగైన సంపదను పంచాలని చెప్పారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ…ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ పని అయిపోయిందన్న పెట్టుబడిదారీ దేశాలు సంతోషపడుతున్న సమయంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోషలిస్టు వ్యవస్థ నేడు ప్రపంచం ముందుకు బలంగా వచ్చిందన్నారు. పేదరిక నిర్మూలన, అభివద్ధి, ఉద్యోగాల కల్పనలో చైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పెట్టుబడి దారీ దేశమైన అమెరికాకు గుండెకాయ లాంటి ఆర్థిక రాజధాని న్యూయార్కులో సోషలిస్టు భావజాలం ఉన్న మమ్దాని అధికారంలోకి వచ్చారనీ, అమెరికా ప్రజలు కూడా సోషలిస్టు వ్యవస్థ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం ప్రభావం పెరుగుతున్న తీరును వివరించారు. కడు పేదరికాన్ని నిర్మూలించడంలో కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం విజయం సాధించిందన్నారు.

రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం వచ్చాక మహిళలకు, పురుషులకు సమాన హక్కులు కల్పించబడ్డాయనీ, పేదరిక నిర్మూలన జరిగిందనీ, ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించిందనీ, రాజ్యపాలన నుంచి మతాన్ని వేరు చేసిందనీ, చర్చి నుంచి పాఠశాలలను దూరం చేసిందని వివరించారు. మన దేశంలో మాత్రం నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో మతాన్ని జొప్పిస్తున్నదనీ, విద్యలోకి ఆర్‌ఎస్‌ఎస్‌ జొరబడిందని విమర్శించారు. అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తితో మోడీ సర్కారు విధానాలను ఎండగడుతూ పోరాటాలు చేయాలనీ, ప్రజలను చైతన్య పర్చాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్‌లో వేదికపైకి వక్తలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె.బాబూరావు ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్‌, బండారు రవికుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఒకదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడం, సోషలిస్టు వ్యవస్థ నిర్మించడం వేర్వేరు అంశాలు. ఉత్పత్తి విధానంలో మార్పు, ఆర్థిక విధానాలు, ఉద్యోగాల కల్పన, మహిళలకు సమాన అవకాశాలు వంటి అంశాల్లో మార్పులు వచ్చి, సోషలిస్టు వ్యవస్థగా మారాలి. సంపద సృష్టి, సమానంగా పంచడం, పేదరికాన్ని నిర్మూలించడమే సోషలిజం. –తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -