అమెరికాను కాదని చైనాకు, రష్యాకు మనదేశం దగ్గరకావడం శుభపరిణామమే. అమెరికా సామ్రాజ్య వాద దేశం. సామ్రాజ్యవాదం అంటేనే దేశదేశాలను ఆయుధ బలగంతో లొంగదీసుకోవడం. యుద్ధాలు, దోపిడీ యధేచ్ఛగా కొనసాగించడం. చైనా, రష్యాలు ఎన్ని మినహాయింపు లున్నప్పటికీ సోషలిస్టు దేశాలు. ఆయాదేశ ప్రజల ఆకలిదప్పులు తీర్చడంలో ముందుంటాయి. విద్యా, వైద్య సదుపాయాలు అందరికీ సమానంగా అందిస్తాయి. పర్యావరణహితంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తుంటాయి. కుల,మత వివక్షలు ఉండనే ఉండవు. కమ్యూనిస్టులను ఆజన్మాంతం గుడ్డిగా ద్వేహించే ఆరెస్సెస్, బీజేపీ భక్తులు కొందరికిది మింగుడు పడక పోవచ్చు. కానీ భారత్ నేడు చైనాకు రష్యాకు దగ్గరకావడం ప్రపంచ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అనివార్య పరిణామం. అదే మోడీ సారధ్యంలో జరగడం విశేషం. సైద్ధాంతికంగా కూడా ఆరెస్సెస్ – కమ్యూనిస్టు వైఖరులు భిన్న ధృవాల వంటివి. హిందూ మత సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా అన్యమతాల అణచివేతకు పాల్పడుతుంది ఆరెస్సెస్. విశ్వమానవాళి విముక్తికై పోరాడుతూ ప్రపంచ కార్మకులారా ఏకంకండు అని చెప్తుంది కమ్యూనిజం.
ప్రస్తుతం ఇజ్రాయిల్ గాజామీద యుద్ధదాడి చేస్తూ దాదాపు 69వేల మంది అమాయకపు ప్రజల మరణా లకు కారణమైంది. వీరిలో స్త్రీలు- పిల్లలే అధికం. ప్రపంచం అందించే ఆహారం, మందుల, సహాయం క్షతగాత్రు లకు అందకుండా చేయడంలో ఇజ్రాయిల్ నేత నెతన్యాహు గావిస్తున్న దమననీతిని లోకం ఎండగడుతున్నది. ఆ దమన నీతికి ట్రంప్ బరి తెగింపు మద్దతు కాదనలేని సత్యం. అమెరికా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుండి ఆ సామ్రాజ్యవాద దమననీతి సుంకాల రంకెలతో బాహాటంగా ప్రస్ఫుటమవుతున్నది. గత పాతికేండ్లుగా అమెరికా-భారత్ మధ్యన కొనసాగుతున్న నిర్మాణాత్మక సహకారం కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాదుల దాడులతో దెబ్బతిన్నది. పాక్-భారత్ మధ్యన వచ్చే అణుయుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ఇప్పటికీ సొంతడబ్బా కొట్టుకుంటున్నాడు. అదీకాక పాక్ సైనికాధికారితో కలిసి విందారగించి పాక్ ఉగ్రవాద చర్యలకు తోడ్పాటు నందిస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు. పులి తనచారలను దాచుకోలేదు అన్నట్టు ట్రంప్ సామ్రాజ్యవాద స్వభావం భారత్‌కే కాదు నేడు యావత్ ప్రపంచానికి వ్యక్తమవుతున్నది.
పరిస్థితులు, ప్రభావాలు ఎంతటివారినైనా దూరం చేయగలవన్నది ఎంతనిజమో దగ్గర చేయగలవన్నది కూడా అంతే నిజం. చైనా మన పొరుగుదేశం. నాలుగువేల కి.మీ.ల సరిహద్దు ఉన్నది. వ్యవసాయం, బౌద్ధ సంస్కృతి తో పాటు ఎన్నో సారూప్యలక్షణాలు మనకు చైనాకు కలసి ఉన్నాయి. ఇరుదేశాలు ఒకొక్కటి 140 కోట్ల జనాభా కలిగి ఉన్నది. 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చి మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవిస్తే, 1949లో జన చైనా విముక్తయి సోషలిస్టు రిపబ్లిక్‌గా అవతరించింది. స్వావలంబన, స్వాభిమానం ఏ దేశానికైనా ప్రాణవాయువే. సరిహద్దు విషయాల్లో పలుదఫాలు ఘర్షణలు, యుద్ధం (1964) జరిగినా ఇప్పుడు హద్దులకు అతీతమైన భాగ స్వాముల బంధంగా కలసి సాగుదామని భారత ప్రధాని మోడీ, చైనా నేత షి – జిన్‌పింగ్ తెలపడం ముదావహం.
‘మన సహకారంపై 280 కోట్ల ప్రజల సంక్షేమం ఆధారపడి ఉందని’ మోడీ వ్యాఖ్యానించడం గమనార్హం. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఇరుదేశాలకు ఉంటుంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అనుమతించరాదన్న ఉభయ నేతల ప్రకటన ట్రంప్‌కు ఓ విధంగా చెంపపెట్టే. కాగా, ట్రంప్ విధానాలపై ఇంటా – బయటా ప్రతిఘటన మొదలైంది. ట్రంప్ విధించే సుంకాలు చట్టవిరుద్దమంటూ అమెరికాలోని ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు రూలింగ్ ఇచ్చింది కూడా. భారత, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్- బ్రిక్స్ దేశాలు ట్రంప్ మాటలు ఖాతరు చేసే పరిస్థితి కన్పించడం లేదు. భారత్-చైనాకు రష్యాకు దగ్గరవుతున్న కొద్దీ ట్రంప్ ప్రతికూల వైఖరి గంగవెర్రులెత్తు తున్నది. చైనాలోని తియాంజిన్‌లో షాంగై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ చైనా నేత షీజిన్ పింగ్‌తోపాటు రష్యా అధినేత పుతిన్‌ను కూడా ప్రత్యేకంగా కలసి ముచ్చటించారు. ప్రపంచశాంతి- సుస్థిరతకు భారత్-రష్యా సంబంధాలు చాలా కీలకమని ఇరుదేశాల నేతలు కలసి ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ముగింపుకు రష్యా చేపట్ట నున్న శాంతియత్నాలను మోడీ స్వాగతించారు. భారత్- రష్యా బహుముఖ సంబంధాలు పురోగిస్తూ ఉంటాయని ప్రకటించడం హర్షణీయం. అన్నిటికంటే ముఖ్యంగా అదే వేదికపై ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవంటూ పెహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రం గా ఖండిస్తూ ఉమ్మడి తీర్మానం చేయటం భారత్ విజయమే.
‘సోషలిజం’ అన్న పదమే అశ్పృశ్యపదంగా భావించి, ఇది మన దేశాని దికాదు, పరాయి దేశానిది అని భావించే ఆరెస్సెస్ వారు మరిప్పుడు ఈ మూడు దేశాల మైత్రిని (భారత్-చైనా- రష్యా) ఎలా జీర్ణించుకుంటారో వేచి చూడాలి. సోషలిజం అంటే సమ సమాజం. ఎవరైనా ఆ వైపుకే అడుగేయక తప్పదు.అందుకే మన అధ్యక్షుడు ట్రంప్ అహానికిపోతూ భారత్‌మీద తీవ్రఒత్తిడి తేవడంతో, భారత్‌ను తెలియ కుండానే అటు చైనాతో ఇటు రష్యాతో ముడివేస్తున్నాడని అమెరికా పత్రికలు వ్యాఖ్యానించడం మనకు మంచిదే కదా.
కె.శాంతారావు
9959745723