నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పూణెలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన అల్ ఖైదా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాడన్న ఆరోపణలపై జుబేర్ హంగర్గేకర్‌ను నిన్న అదుపులోకి తీసుకున్నారు. గత నెల నుంచి అతనిపై నిఘా పెట్టిన ఏటీఎస్ అధికారులు, అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో హాజరుపరిచారు. దీంతో ప్రత్యేక UAPA కోర్టు నిందితుడికి నవంబర్ 4 వరకు పోలీస్ కస్టడీ విధించింది.
పూణెలోని కొండ్వా ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్రతో పాటు ఇతర నగరాల్లో ఉగ్రదాడులకు హంగర్గేకర్ ప్లాన్ చేస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతని నివాసంలో సోదాలు నిర్వహించగా, యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించేందుకు ఉద్దేశించిన పలు కీలక మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అరెస్టుకు ముందు, అక్టోబర్ 27న పూణె రైల్వే స్టేషన్‌లో చెన్నై ఎక్స్‌ప్రెస్ నుంచి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, అక్టోబర్ 9న పుణెలోని పలు ప్రాంతాల్లో ఏటీఎస్ దాడులు చేసి ఎలక్ట్రానిక్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామాలు ఈ ప్రాంతంలో విస్తృత ఉగ్రవాద నెట్‌వర్క్ ఉందనడానికి సంకేతాలని అధికారులు భావిస్తున్నారు.



