Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంవందేమాతరంలో కొన్నిభాగాలు తొలగింపు

వందేమాతరంలో కొన్నిభాగాలు తొలగింపు

- Advertisement -

కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శలు
వందేమాతరానికి 150 ఏండ్ల సందర్భంగా స్టాంప్‌, నాణేం విడుదల

న్యూఢిల్లీ : మన జాతీయ గీతం వందేమాతరంలో కొన్ని ముఖ్యభాగా లను కాంగ్రెస్‌ 1937లో తొలగించిం దని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. దీని వలనే దేశంలో విభజనకు బీజాలు నాటాయని, దేశంలో విభజన మనస్తత్వం ఇప్పటికీ సమస్యగానే ఉందని మోడీ ఆరోపించారు. వందేభారతం గీతానికి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మోడీ ఈ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వందేమాతరంపై స్మారక స్టాంపు, నాణేన్ని కూడా మోడీ విడుదల చేశారు. ‘వందేమాతరం గీతం భారత స్వాతంత్య్ర పోరాట స్వరంగా మారింది. ఇది ప్రతి భారతీయుడి భావాలను వ్యక్తపరిచింది. అయితే దురదృష్టవశాత్తు, 1937లో వందేమాతరంలోని ముఖ్యమైన చరణాలు అంటే దాని ఆత్మ తొలగించబడింది.

వందేమాతరం విభజనకు బీజాలు కూడా నాటింది. ఈ జాతి నిర్మాణం అనే ‘మహా మంత్రం’తో ఈ అన్యాయం ఎందుకు జరిగిందో నేటి తరం తెలుసుకోవాలి.. ఈ విభజన మనస్తత్వం ఇప్పటికీ దేశానికి ఒక సమస్యగానే ఉంది’ అని మోడీ అన్నారు. అలాగే, ప్రతీ శకంలోనూ ‘వందేమాతరం’ స్పూర్తిగానే ఉంటుందని, ఆపరేషన్‌ సిందూర్‌ గురించి స్పష్టంగా ప్రస్తావిస్తూ మోడీ తెలిపారు. ‘ఉగ్రవాదాన్ని ఉపయోగించి మన భద్రత, గౌరవంపై దాడి చేయడానికి శత్రువలు ధైర్యం చేసినప్పుడు.. మన దేశం దుర్గా రూపాన్ని ఎలా ధరించిందో ప్రపంచం చూసింది’ అని మోడీ అన్నారు. వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ గీతం మనకు కొత్త ప్రేరణను ఇస్తుందని, దేశ ప్రజలను కొత్త శక్తితో నింపుతుందని ప్రధానమంత్రి అన్నారు.

అలాగే, ‘వందేమాతరం అనేది ఒక పదం, ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం. ఇది భారతమాత పట్ల భక్తి, భారతమాత ఆరాధన. ఇది మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది. మన భవిష్యత్తుకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మన భారతీయులు సాధించలేని సంకల్పం లేదు, మనం సాధించలేని లక్ష్యం లేదు. జ్ఞానం, సైన్స్‌. టెక్నాలజీ ఆధారంగా దేశాన్ని మనం అగ్రస్థానంలో ఉంచాలి’ అని మోడీ అన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు ఈ నెల 7 నుంచి వచ్చేడాది నవంబర్‌ 7 వరకూ జరుగుతాయి. ఈ పాటను 1875 నవంబర్‌ 7న బంకిం చంద్ర ఛటర్జీ రచించారు. ఈ గీతం ముందుగా సాహిత్య పత్రిక ‘బంగదర్శన్‌’లో ప్రచురితమైంది. ఛటర్జీ నవల ‘ఆనందమఠం’లో భాగంగా కనిపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -