నవతెలంగాణ – హైదరాబాద్: మద్రాస్ హైకోర్టులో కేసుల లిస్టింగ్, విచారణకు సంబంధించి అనుసరిస్తున్న నిబంధనలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “అక్కడ ఏదో తప్పు జరుగుతోంది” అని వ్యాఖ్యానిస్తూ, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది.
నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి సంబంధించిన కరూర్ తొక్కిసలాట కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కరూర్ ఘటనపై మద్రాస్ హైకోర్టులోని రెండు వేర్వేరు బెంచ్‌లు పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణను మధురై బెంచ్ తిరస్కరించగా, కేవలం రోడ్‌షోలకు మార్గదర్శకాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చెన్నై బెంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ఆదేశించడాన్ని అనుచితమని గతంలోనే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
విచారణ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ, “హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోంది. మేం దీన్ని పరిశీలించాల్సి ఉంది” అని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.కె. కౌల్ వాదనలు వినిపిస్తూ.. ఈ ఘటనపై తాము ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌పై స్టేను ఎత్తివేయాలని కోరారు. అయితే, ముందుగా హైకోర్టు పనితీరుకు సంబంధించిన అంశాన్ని తేలుస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.



