– గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన
నవతెలంగాణ-మియాపూర్
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడమే కాక అడిగినందుకు కన్న తండ్రినే కుమారుడు అతి కిరాతకంగా చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు ప్రకారం.. హనుమంతు (38) కుటుం బంతో గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసముం టున్నాడు. అతని భూమిని తాకట్టు పెట్టి రూ.6 లక్షల తీసుకుని ఇంట్లో పెట్టాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ కుమారుడు రవీందర్.. తండ్రికి తెలియకుండా ఆ రూ.2.50లక్షలు తీసుకొని బెట్టింగ్‌లో పెట్టి మొత్తం పొగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి హనుమంతు దాచుకున్న డబ్బులు ఖర్చు చేస్తున్నాడని మందలించాడు. ఆ డబ్బులు స్నేహితునికి ఇచ్చానని చెప్పి దాటవేస్తూ వచ్చాడు.
అయినా హనుమంతు డబ్బుల గురించి రోజూ ప్రస్తావిస్తుండటంతో తండ్రిని ఎలాగైనా హత్య చేయాలని కుమారుడు అనుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం12 గంటల సమయంలో డబ్బులు తిరిగి ఇస్తానని తండ్రిని నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో మెడపైన, ఇతర భాగాల్లో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియన్నట్టు బంధువయిన రమేశ్‌కు ఫోన్ ద్వారా తనకు తానుగా కత్తితో పొడుచుకుని చనిపోయాడని నమ్మబలికాడు. రమేష్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు మృతుని కుమారుడు రవీందర్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించాడు.