‘సాపాటు ఎటూలేదు, పాటైనా పాడు బ్రదర్…’ అప్పట్లో ఈ పాట ప్రతినోటా విన్నాము. ఇప్పటికీ మరింత పాడుకునేవాళ్లు పెరిగిపోయారు. ‘నేనా..పాడనా పాటా..నీవా అన్నదీ మాటా…’అనే గుప్పెడు మనసు సినిమా పాట వెంటాడుతూనే ఉంటది. 1962లో ఆనాటి ప్రధాని నెహ్రూగారి ముందు లతాజీ పాడిన ” ఏ మేరె వతన్‌కే లోగో” పాట దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. పాటకు హృదయాలను కదిలించే గుణముంటది. పాట కరిగిస్తుంది. కదిలిస్తుంది. ఏడిపిస్తుంది. ఓదారుస్తుంది. ఉరకలెత్తిస్తుంది, నిలదీస్తుంది. ధిక్కరిస్తుంది. ఉద్యమిస్తుంది. సమూహమై నినదిస్తుంది. పాటకు అంత శక్తి ఉంది. పాట సమూహపు సృజనాభివ్యక్తి.
మనుషులను కలిపే స్వరశక్తి. పనిలో అలసట తీరుస్తుంది. పోరులో ఉత్సాహాన్ని స్తుంది. అట్లాంటి ఒకానొక ఉద్యమగీతాన్ని ఆసరా చేసుకుని, విభజననూ విద్వేషాలను సృష్టించేందుకు పూనుకోవడం నేటి విషాదం. వందేమాతర గీతంపైన లోక్‌సభలో పదకొండు గంటలసేపు చర్చ జరిగింది. ఆ గీతానికి నూట యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రభుత్వం ఈ చర్చకు పూనుకుంది. ‘వందేమాతరం’ గీతాన్ని చిన్నప్పటి నుండీ పాఠశాలలో పాడుతూనే ఉన్నాం. స్వాతంత్య్ర స్ఫూర్తిని పొందుతూనే ఉన్నాము. మనం స్వేచ్ఛాస్ఫూర్తిని పొందితే, వాళ్లు ఎన్నికల ప్రయోజనాలను పొందేందుకు చర్చను తీసుకొచ్చారు.
బెంగాల్‌కు చెందిన రచయిత బంకించంద్ర చటర్జీ 1875లో రాసిన ఈ గీతం 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ మారుమోగింది. అంటే విభజనకు వ్యతిరేకం ఈ పాట. ఇప్పుడు మనుషుల విభజన కోసం బీజేపీ వాడుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో అనేక గీతాల పాద పంక్తులు నినాదాలుగా ఉత్తేజ పరిచాయి. భగత్‌సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్, జైహింద్, వందేమాతరం, దేశ ప్రజలందరినీ ఐక్యంగా ఉద్యమించేట్టు చేసింది. ఈ నినాదాలు, పాటలు, ఎందుకోసం ఇంత ప్రాధాన్యతనూ, ప్రాశస్త్యాన్ని పొందాయి అంటే, వాటి వెనకాల అశేష ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్ర కాంక్షలు ఉన్నాయి. వాటి కోసం సమస్త ప్రజలు ఐక్యంగా చేసే సమరం ఉంది. ఇది ఆ పాదాలకు అంతటి శక్తిని అందించింది.ఇప్పుడు ఈ పాటను, మొత్తం పాటను పాడుకోవాలని, పాటను తుంచేశారని తెగ బాధపడిపోతున్నట్టు ఫోజులు పెడుతున్నవారు, వారి పరివారం, ఈ పాట స్ఫూర్తిని నింపిన నాటి స్వాతంత్య్ర ఉద్యమంలోనే పాల్గొనలేదు.
లేకపోగా దానికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు. ఇంతెందుకూ 1925లో ఏర్పడిన ఆరెస్సెస్, జనసంఘ్ వారు ఆ పాటను యాభైయేండ్లవరకూ పాడలేదు. దేశ చిహ్నమైన మూడు రంగుల జెండానూ ఎగురవేయలేదు. అట్లాంటిది ఆ పాటపై ఇప్పుడెందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది! అది బెంగాల్‌లో జరిగే ఎన్నికలపై ప్రేమ. స్వాతంత్య్రానికి ముందు బెంగాల్‌లో ముస్లింలీగ్‌తో జతకట్టి, నాటి జనసంఘ్ నేత శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇతను ఆర్థికమంత్రిగా ఉండి, బ్రిటీష్‌కు వ్యతిరేకంగా చేసిన స్వతంత్ర పోరాటం విఫలమయిందనీ బ్రిటీషర్స్‌కు అనుకూలంగా వారికి లేఖ కూడా రాశారు. ఇదీ వారి చరిత్ర. వీరికి వందేమాతరం పేరెత్తడానికి అర్హత ఎక్కడిది చెప్పండి!
వందేమాతర గీతాన్ని నాడు ఉర్దూ, తమిళం, పంజాబీ ఇంకా అనేక భాషలలోకి అనువాదం చేసి హిందువులు, ముస్లింలు పాడుకున్నారు. 2017లో ఒక టీవీ చానెల్‌లో బీజేపీ నాయకుడు బల్దేవ్‌సింగ్‌ను వందేమాతరం పాడమంటే, సెల్‌లో చూస్తూ కూడా పాడలేకపోయాడు. వారి నాయకుడు నవీన్‌కుమార్ సింగ్ కూడా పాడలేక పోయాడు. యాభైయేండ్లు పాడని, పాడటం రానివాళ్లు ముస్లింలు పాడితేనే దేశంలో ఉండాలని బెదిరించడం ఎంతటి నీతి బాహ్య చర్య.1938లో, ఆ తర్వాత, అనేక ఆలోచనలు చేసిన నాటి నాయకులు, దేశాన్ని హిందూ దేవతలతో పోల్చిన మిగతా చరణాలను మినహాయించి, మొదటిరెండు చరణాలను పాటగా పాడుకోవచ్చని ఎప్పుడో నిర్ణయించారు. ఆ నిర్ణయ ఆమోదంలో వీరి శ్యామ ప్రసాద్ ముఖర్జీ, ఇతర ప్రసిద్ధ నాయకులూ ఉన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన మాటలు ఎంతో ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.
‘వందేమాతరం’ పాటలోని భావం, సుజలాం సుఫలాం-అంటే మంచినీరు, మంచి ఫలం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా? డెబ్బయి శాతం నీరు కలుషితమై తాగడానికి వీలులేకుండా మారిపోయింది. దీన్ని ఏమైనా బాగుచేస్తారా? ‘మలయజ శీతలాం’.మంచి స్వచ్ఛమైన గాలి, నేడున్నదా! పొల్యూషన్‌తో అనారోగ్యం, మరణాలు సంభవిస్తున్నాయి. సస్యశ్యామలం…ఇప్పుడు నేల తన సారాన్ని కోల్పోయింది. మందులతో, రసాయనాలతో, కాలుష్యంతో నీటి జాడలు కరుంవయ్యాయి. పచ్చదనం అంతరిస్తోంది. వీటి గురించి ఆలోచన ఉందా మీకు! సుమధుర భాషిణి… ఎక్కడుంది మంచిభాష? ఎప్పుడూ విద్వేషపు సంభాషణలే కదా! అంతేకాదు, మణిపూర్‌పై చర్చించడానికి ఇష్టపడని వాళ్లు నూటయాభై ఏండ్ల క్రితపు పాటకోసం పదిగంటల సమయం తీసుకుంటారు! మణిపూర్ ప్రజలు ఈ దేశవాసులు కారా అని ప్రశ్నిస్తున్నారు. పాటతో ఆటలాడుదాం అనుకోకండి. అది చరిత్ర పాఠమై నిలదీస్తుంది!
పాట-పాఠం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



