రైతుబంధు పింఛన్ డబ్బులే హత్యకు కారణం
నవతెలంగాణ-వట్‌పల్లి
వృద్ధాప్యంలో భర్త మరణించిన అనంతరం సంరక్షించవలసిన కొడుకులు, మనవళ్లు కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరించారు. రైతుబంధు, పింఛన్ డబ్బుల కోసం 80 ఏండ్ల వృద్ధ తల్లిని హత్య చేశారు. ఈ సంఘటన వట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్వేల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. జోగిపేట సీఐ అనిల్ కూమార్ వివరాలను వెల్లడించారు. మార్వెల్లి గ్రామానికి చెందిన చాకలి బసమ్మ (80)ను జులై నెల మూడున కొడుకులు, మనవళ్లు కలిసి విపరీతంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. దాంతో కొడుకు బషయ్య జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసము సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు అసహజ మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈనెల 18న వైద్యుల నివేదికలో కొట్టి చంపినట్టు… చాతిలో, ఇతర భాగాలపై బలమైన దెబ్బలు తగిలినట్టు, చాతిలో రక్తం గడ్డలు కట్టడంతోనే వృద్ధురాలు మృతి చెందిందని తేలిందన్నారు.
అ సహజ మరణం నుండి హత్య కేసుగా నమోదు చేసినట్టు తెలిపారు. గ్రామానికి వెళ్లి బసమ్మ కొడుకులను, మనవళ్లను అదుపులోకి తీసుకొని విచారించగా.. పోషణ విషయములో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆమె పేరుతో ఉన్న భూమికి రైతుబంధు వస్తుందని, పింఛన్ డబ్బులను అందరికీ సమానంగా ఇవ్వకుండా ఒకరికి ఇస్తుండడంతో మద్యం మత్తులో కర్రలతో కట్టెలతో కొట్టి చంపినట్టు అంగీకరించారు. హత్య నేరాన్ని అంగీకరించడంతో చాకలి బషయ్య, చాకలి అంబయ్య, చాకలి వెంకయ్య, చాకలి నరసింహులు, చాకలి మోహన్, చాకలి రాజు (చిన్న)ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లవకుమార్ పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు .