హలో హౌ ఆర్‌యూ అన్నాడు కృష్ణారావు ఖరీదైన మేబ్యాచ్ కళ్లజోడు కళ్లమీదినుంచి తీసి టేబిల్‌మీద పెడుతూ.
ఫైన్.. థాంక్స్! అన్నది టీ కప్పు పొగల్తో చేతికి అందిస్తూ దృపది.
బావగార్లేమంటున్నారు.. అంతా ఓకేనే కదా అన్నాడు అన్నయ్య హుషారుగా.
ఓకే అంటే ఓకేనే… ఇట్లా వున్నాం అంది చెల్లెమ్మ దిగులుగా.
టీ బాగుంది.. పంచదార ఎక్కువేం కాలేదు అన్నాడన్నయ్య టాపిక్ మార్చడానికి.
వదిన్లేమంటున్నారన్నయ్యా అంది చెల్లెమ్మ ఆ పనే తనూ చేయడానికి.
కరెంటఫయిర్సయ్యాక ఫ్లాష్‌బాక్‌లోకి వెళ్లారిద్దరూ.
తల్చుకుంటే ఒళ్లు మండుతోందన్నయ్యా అంది చెల్లెమ్మ కళ్లు మూసుకుని.
అవును మాకూనూ అన్నాడన్నయ్య కళ్లు వెడల్పుగా తెర్చుకుని.
ఆ గొట్టాంగాణ్ణి ఎన్‌కౌంటర్ చెయ్యాలన్నయ్యా.
ఏ గొట్టంగాణ్ణి! లాక్కువచ్చినవాణ్ణా, లాక్కురమ్మన్న వాణ్ణా? అడిగేడు అన్నయ్య.
గొట్టాం గాళ్ళిద్దర్నీనూ…
అయినా వీళ్లని ఎవడాడమన్నాడమ్మా గాంబ్లింగ్. గ్రేట్ గాంబ్లిలర్స్‌లాగా…
అందరూ కాదులే భాయీ. ఆ పెద్దాయనకే యమపిచ్చి. ఆటలో కూర్చుంటే అమ్మనీ, ఆలినీ, ఒంటినీ మర్చిపోతాడు. బంగారు గాజులు సినిమాలో నాగేశ్వర్రావంటి అన్నయ్యవి నువ్వుండబట్టి సరిపోయింది.
అవన్నీ ఇప్పుడెందుకమ్మా! అన్నాడన్నయ్య.
ఇల్లా మరచిపోతానన్నయ్యా. ఆ వేళ మీటింగ్ హాల్లో ఆ పెద్ద గొట్టాంగాడు గెలిచేనని ఇరిటేటింగ్‌గా నవ్వుతూ చినన గొట్టాంగాడ్ని పంపి నన్ను లాక్కువచ్చేట్టు చేసి, చీర విప్పమనడం…
అప్పుడు నువ్వు పాడిన పాట నాకింకా గుర్తుందమ్మా.
సమయానికి పాట తట్టింది కాబట్టి సరిపోయింది. పాటకంటే వాల్యూమ్ ముఖ్యమమ్మా. అది నా చెవుల్ని చిల్లులు పొడిచి లాక్కువచ్చింది. నిన్ను సేవ్ చేయడానికి ఊళ్లో వున్న షాపులన్నిటిలోంచీ చీరలు మోసుకొచ్చాను. నువ్విక ఆ సీన్ మర్చిపో చెల్లీ.
ఎలా మరిచిపోనన్నా. కళ్లు మూసినా తెరిచినా నించున్నా కూచున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, వంటింట్లో తిరగమోత పెడుతున్నా, ప్రతిక్షణం గుర్తుకువచ్చేది….
ఏమిటమ్మా చెప్పు… ఏమిటది?
ఇంకా అర్థం అవలేదా బ్రదర్… నువ్వు నన్ను సేవ్ చెయ్యడానికి తెచ్చిన చీరల సంగతి… నేనంటోంది.
చీరలు… యూ మీన్ సారీస్…
యస్… యస్… ఈ చీరలే.. ఎన్ని రంగులు… ఎన్ని డిజైన్లు… ఒకటి పూర్తిగా చూసుకునేలోపే మరొకటి.. అబ్బ… కళ్లు చెదిరిపోయాయనుకో.
ఈ అన్నయ్యంటే ఏమనుకున్నావ్. అన్నాడు కృష్ణారావు గర్వసగర్వంగా.
కానీ…
సందేహించకు తల్లీ అన్నాడు అన్నయ్య లాలనగా. అన్ని రకాల రంగులడిజైన్ల చీరలు అన్నీ ఇట్టే కనిపించి అట్టే మాయమైపోయినవి. అదే నా బాధ అన్నయ్యా… అప్పటినుంచీ ఆ బాధతో ఎంత చిక్కిపోయానో చూడన్నయ్యా.
అయితే ఇప్పుడేం చెయ్యమంటావు అన్నాడన్నయ్య.
అంటే మరేం లేదు. అట్టి ఆనాటి ఆ రంగురంగుల చీరలునాకోసం తెచ్చినవే కనుక అవి నాకిచ్చేస్తే, యుద్ధం వచ్చి, నా మొగుళ్లు గెలిచి రాజ్యానికి వచ్చేదాకా చీరలడగను. ఇదే నా శపథం అంది చెల్లెమ్మ.
ఆలోచనలో పడ్డాడు అన్నయ్య. ఆ తర్వాత ఇలాగ అన్నాడు… ఆ వేళ మీటింగ్ హాల్లో నుంచి మోసుకుపోయిన చీరలన్నీ ద్వారకాపురిలో పడేశానా! వాటిమీద ఎగబడ్డారు నీ వదినలూ, నా ఎనిమిది మంది వైఫులూ. సత్య సంగత్తెల్సుగదా, చీరల సెలెక్షన్ సందర్భంగా తతిమ్మా వాళ్లని గిల్లింది, గీరింఇ, నానా గందరగోళం జరిగిపోయిందమ్మా.
హయ్యో, ఎంత పని జరిగిందన్నయ్యా. నా కోసం, నువ్వు పట్టుకొచ్చిన చీరల కోసం వదినలు తగవులాడుకోవడం బాగులేదన్నయ్యా. అయితే చీరలన్నీ వాళ్లే పంచేసుకున్నారన్నమాట. ఒక్కటంటే ఒక్కటీ మిగల్లేదూ. ఆ ఆరెంజ్ కలర్ టిష్యూ… అయ్యో.. ఆ ఉల్లిరంగు టస్సర్… పోనీ ఆ గంధం రంగు పోచంపల్లి సారీ…
జరీ చీరలూ, కొత్త డిజైన్లూ… సాదా చీరలూ, రా సిల్కులూ, బెంగాల్ కాటన్ చీరలూ, కాశ్మీరీ సిల్కు సారీసూ… ఒక్కటీ మిగలకుండా ఎత్తుకుపోయి కప్‌బోర్డులు నింపుకున్నారు. సారీ చెల్లీ, నీకా సారీల్లో ఒక్కటీ ఈ శ్రావణంలో ఇవ్వలేకపోయినందు వెరీ వెరీ.. సారీ అన్నాడన్నయ్య.
పోనీలే అన్నయ్యా! మొగుళ్లకే నేనప్పుడు.. మొగుడన్నాక పెళ్లానికి చీరలు ఇవ్వడానికి కాకపోతే, దేనికనే కదా, ‘నాతిచీరామి’ అని పెళ్లిమంత్రం చెబుతోంది. నువ్వు మాత్రం ఏం చేస్తావు?
హమ్మయ్య! క్షమించేశావు కదమ్మా అన్నాడన్నయ్య.
పర్వాలేదులే అన్నయ్యా! టీ తాగడం అయిపోయింది కదా! షాపులు తెరిచే వుంటారు. వెళ్లి కొనుక్కుందాం. గూగుల్ పే, ఫోన్ పే వున్నాయి కదా నీ ఫోన్లో. పుట్టింటి పట్టుచీర కట్టుకోవాలనిఈ ఆడకూతురుకు వుండదు చెప్పు. రాఖీశ్రావణంలో. ఓ నాలుగో అయిదో నాకు నచ్చినవీ, ఓ రెండోమూడో నీకు నచ్చినవీ… ప్యాక్ చేయించుకు వద్దాం పద అంది చెల్లి.
—
పండగకైనా, పబ్బానికైనా, పెళ్లికైనా, జోరు జబర్దస్తీ అంతా చీరలదే. ఏమండోరు అనడానికి బదులు ఏరా, ఒరే, కన్నా అని ఎక్కడ్నించన్నా సౌండు వినపడిందంటే మగ పర్సుకి ఖర్చొచ్చిందన్న మాటే. ఐదో పదో పాతికో పచ్చ గాంధీలిచ్చి వదిలించుకోవడం ఆరోగ్యానికి రక్ష. ఊరికే ఉత్సాహపడి, వెంట షాపింగుకు వెళ్లారో, షాప్ వాడికీ, ఆమె గారు అద్దాల్లోనుంచి ఇవతలికి లాటి గుట్టలు గుట్టలుగా పడేసిన చీరల మధ్య బిక్కుబిక్కుమంటూ ఖర్చయిపోతారు సుమా!
కృష్ణారావు చెల్లెమ్మయితేనేం, గవర్నర్ సతీమణి అయితేనేం చీరకు కావాల్సింది… చీరే. సారీ… సారీనే…
– చింతపట్ల సుదర్శన్
9299809212
సారీ…స్!
- Advertisement -
- Advertisement -