నవతెలంగాణ-పెద్దవూర
మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో పెద్దవూర, పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతులు వివరాలు గురించి యస్ ఐ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, ఎస్ హెచ్ ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి, సిబ్బందికి కేటాయించిన కిట్లను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, స్టేషన్ క్రైమ్ రికార్డ్,జనరల్ రికార్డ్స్ లు తనిఖీ చేసి సాధారణంగా ఎక్కువగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసు కున్నారు.ఈసందర్బంగా మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు. 
పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా వారి పట్ల తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. స్టేషన్ పరిదిలో ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ వారి సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్ , పెట్రో కార్ డ్యూటీ లో ఉన్నప్పుడు 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు ఆయా గ్రామాలకు ప్రతి రోజు సందర్శించి నేర నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు.బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిదిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు చేపట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. నేర నియంత్రణ దొంగతనాల నివారకు స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు,ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పని చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి, పిడియస్ రైస్ అక్రమ రవాణా,జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి గంజాయి తాగే వారిని, వారికి సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, సిఐ శ్రీను నాయక్, పెద్దవూర ఎస్ ఐ ప్రసాద్ మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

 
                                    