– సురక్షిత ప్రయాణం కోసం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి..
– ట్రాఫిక్ నియమాలను పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం ..
– జిల్లా ఎస్పి.యం. రాజేష్ చంద్ర
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ భద్రతను మరింత మెరుగుపరచడానికి నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను సమగ్రంగా పరిశీలించారు. కొత్త బస్టాండ్ నుండి లింగంపేట్, ఎల్లారెడ్డి వైపు వాహన రాకపోకలు సాఫీగా సాగేలా ట్రాఫిక్ సిగ్నల్స్ ను తనిఖీ చేసి, ఇకపై వాహనదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఆర్ఎస్ఐ మహేష్ కు సూచించారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత అని, సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ప్రతి ప్రయాణంలో ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా సురక్షితం అవుతుందని, రాంగ్ రూట్ లేదా అశ్రద్ధగా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగంతో డ్రైవ్ చేయకూడదని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అదే విధంగా సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు.
ముఖ్యమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు – ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ – సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాష్ డ్రైవింగ్ లాంటివి చేస్తే వాహనదారులకు ట్రాఫిక్ చలాన్‌లు జారీ చేయబడతాయని తెలిపారు. కామారెడ్డి పట్టణ పౌరులు, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి, పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట కామారెడ్డి ఎఎస్పీ బి. చైతన్య రెడ్డి, టౌన్ సీఐ నరేష్ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.