Monday, September 15, 2025
E-PAPER
Homeదర్వాజస్పార్టకస్‌ చారిత్రక స్ఫూర్తి..

స్పార్టకస్‌ చారిత్రక స్ఫూర్తి..

- Advertisement -

కథలు, కథానికలు, నవలలు, నాటికలు, సినిమాలలోని పాత్రలు ఏదో ఒక సందర్భంలో మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. మనల్ని ఆలోచింపజేస్తాయి. మనలో మార్పుకు కారణమవుతాయి. మనకు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. అలానే మనలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీస్తాయి.
1951లో అమెరికన్‌ రచయిత హౌవార్డ్‌ ఫాస్ట్‌ రచించిన చారిత్రక ‘స్పార్టకస్‌’ నవల తెలుగు అనువాదాన్ని కొన్ని రోజుల క్రితం చదివాను. ఈ నవలను ఆకెళ్ళ కష్ణమూర్తి తెలుగీకరించారు. నవలలో రోమ్‌ కాలంనాటి సమాజ తీరుతెన్నులు ఉంటాయి. ఆనాటి బానిస సమాజం ఎదుర్కొన్న అణిచివేత, కష్టాలు, స్వేచ్ఛకోసం పరితపిస్తూ వాళ్లు చేసిన తిరుగుబాటు అందులో ఉంటుంది. పెత్తందార్లకు, నిరంకుశత్వానికి వెన్నుచూపకుండా ఎదురొడ్డి పోరాడిన వారి పోరాటపటిమ ఆదర్శంగా నిలుస్తుంది.
కర్ర ఉన్నవాడిదే బర్రె అనే సిద్ధాంతాన్ని పాటించే పెత్తందార్ల మనసత్త్వం ఎలా ఉంటుంది? అణిచివేతకు గురవుతున్న వారి మనసత్త్వం ఎలా ఉంటుందనే కోణాన్ని ఈ నవల తెలియజేస్తుంది. నవలలోని ప్రధానపాత్ర ‘స్పార్టకస్‌’ పాఠకుల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. స్పార్టకస్‌ పాత్రే కాకుండా రోమ్‌లోని బానిసలు ఎదుర్కొన్న అణిచివేత- కష్టాలు పాఠకుల హదయాలని మేలేసి, ఆలోచింపజేస్తుంది.

బానిస సమాజంలో పుట్టిపెరిగిన స్పార్టకస్‌ చిన్నప్పటినుంచి చనిపోయే వరకు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందుల కొలిమిలో పడి స్పార్టకస్‌ రాటుతేలుతాడు. ఒక సమూహానికే నాయకుడు అవుతాడు. సమాజం కోసం, సమసమాజ స్థాపన కోసం, రేపటి తరం కోసం ఉద్యమిస్తాడు.
ఒక వ్యక్తి బానిస కావాలన్నా, నాయకుడు కావాలన్నా ఆ వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుందని స్పార్టకస్‌ నవల పరోక్షంగా చెపుతుంది. ”మనం బాధ్యతను నిర్వర్తించాలి- వివక్షలేని సమాజం కోసం కషి చేయాలి. అన్యాయానికి, అణిచివేతకు ఎదురొడ్డి పోరాడల”ని స్పార్టకస్‌ నవలను చదివేటప్పుడు పాఠకుడికి ఖచ్చితంగా అనిపిస్తుంది. సమయం అనుకూలంగా ఉన్నా లేకపోయినా, మనం మన బాధ్యత నిర్వర్తిస్తే, సమాజం కోసం పాటుపడితే అది మన జీవితానికి సార్ధకతను ఆపాదిస్తుందనేసి స్పార్టకస్‌ నవల, అందులోని ప్రధాన పాత్ర మనకు హితోపదేశం చేస్తుంది.
అంతేకాకుండా, ఒక నాయకుడు ఎలా ఉండాలి? ఎలా ఆ వ్యక్తి ఆదర్శంగా నిలుస్తాడు? ఒక మహౌన్నతమైనవ్యక్తి ఎలా అవుతాడు? తరతరాల వరకు అతని జీవితం కాల ప్రవాహం ద్వారా ఎలా తెలుస్తుంది. మహౌన్నతమైన సామ్రాజ్యాలుగా వెలుగొందిన దేశాల వెనుక చీకటి కోణాన్ని స్పార్టకస్‌ ద్వారా పాఠకుడు తెలుసుకుంటాడు. ఇందులోనే ప్రధాన పాత్ర స్పార్టకస్‌ ఒక చైతన్యానికి ప్రతీక, ఉత్తేజానికి నిలువెత్తు నిదర్శనం.
ఒక వ్యక్తి మీద ప్రభావం, స్ఫూర్తి ఇవన్నీను కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఈరోజు ప్రభావం చూపించింది, రేపు చూపించొచ్చు చూపించకపోవచ్చు. రేపు మరేదైనా ప్రభావం చూపించొచ్చు. ఈరోజు స్ఫూర్తిగా నిలిచింది, రేపు స్ఫూర్తిగా నిలవొచ్చు నిలవకపోవచ్చు, వేరే ఏదైనా నిలవొచ్చు.

  • సయ్యద్‌ ముజాహిద్‌ అలీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -